న్యూఢిల్లీ : బహిరంగ ప్రదేశంలో ఉపయోగించని, వాడటానికి పెట్టని మోటారు వాహనంపై పన్ను విధించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. మోటారు వాహనాల పన్ను అనేది పరిహారపూర్వక స్వభావం కలిగినదని తెలిపింది. అటువంటి వాహనం యజమానిపై పన్ను భారం విధించకూడదని వివరించింది. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు 2024లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన అపీలుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వివరణ ఇచ్చింది.
మోటారు వాహనాల పన్ను అనేది స్వభావరీత్యా నష్టపరిహార పూర్వకమైనదని, ఆ వాహనాన్ని వినియోగించే తీరుకు,ఈ పన్నుకు ప్రత్యక్ష సంబంధం ఉందని తెలిపింది. రోడ్లు, హైవేలు వంటి ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే వ్యక్తి తన వాహనానికి పన్ను చెల్లించవలసి ఉంటుందని తెలిపింది. మోటారు వాహనాన్ని బహిరంగ ప్రదేశంలో ఉపయోగించకపోతే, బహిరంగ ప్రదేశంలో ఉపయోగించడానికి పెట్టకపోతే, సంబంధిత వ్యక్తి ప్రభుత్వ మౌలిక సదుపాయాల నుంచి ప్రయోజనం పొందడం లేనట్లేనని తెలిపింది.