పాట్నా: ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్‌లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, బీజేపీ విజయం బీహార్‌పై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. దీని గురించి మీడియా అడిగిన ఈ ప్రశ్నకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) సమాధానం ఇచ్చారు. ఈ వాదనను ఆయన తోసిపుచ్చారు. ఢిల్లీలో బీజేపీ విజయం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదని తెలిపారు. ‘బీహార్ అంటే బీహార్. దానిని అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.
కాగా, ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తెలిపారు. సుమారు 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలే ప్రధాన కారణమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం బీజేపీ బాధ్యత అని గుర్తు చేశారు. కేవలం వాగ్దానాలతో సరిపెట్టబోరని తాను ఆశిస్తున్నట్లు మీడియాతో అన్నారు.