న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోయినపుడు, ఆ బారుల పొడవు నిర్దేశిత దూరం మించినపుడు లేదా వేచి ఉండాల్సిన సమయం నిర్దేశిత పరిమితిని దాటినపుడు, టోల్ రుసుము చెల్లింపును మినహాయించే నిబంధనలేవీ లేవని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ సోమవారం పార్లమెంటుకు తెలిపింది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల మధ్య దూరం 60 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉండవచ్చునని సంబంధిత నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని చెప్పింది. లోక్సభలో ఇద్దరు సభ్యులు వేర్వేరుగా అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఎన్హెచ్ ఫీ రూల్స్ అండ్ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం 60 కి.మీ. పరిధిలో ఒకటి కన్నా ఎక్కువ టోల్ ప్లాజాలు పని చేయవచ్చునని స్పష్టం చేశారు. శాశ్వత వంతెన, బైపాస్, సొరంగం వంటివాటి కోసం ఈ విధంగా మరొక టోల్ ప్లాజా ఉండవచ్చునన్నారు.