Domestic workers : ఇళ్లలో పనిచేసేవాళ్ల (Domestic Workers) కు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం (Karnata Govt) కీలక చర్యలు చేపట్టింది. అగ్రిమెంట్ (Agrement) లేకుండా ఇంటి పనివాళ్ల నియామకంపై నిషేధం విధించేలా, వారికి కనీస వేతనాలు చెల్లించే విధంగా ప్రతిపాదిత ముసాయిదా బిల్లు (Draft bill) ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించే ఇంటి పనివాళ్లను నియమించుకునే సర్వీస్ ప్రొవైడర్లకు, ఏజెన్సీలకు కనిష్ఠంగా మూడు నెలల జైలుశిక్ష, జరిమానా విధించనున్నారు.
ముసాయిదా బిల్లు ప్రకారం.. సహాయకులను నియమించుకునే సందర్భంలో డొమెస్టిక్ వర్కర్‌కు, ఉద్యోగం కల్పించే వ్యక్తికి మధ్య తప్పనిసరిగా లిఖిత పూర్వక ఒప్పందం ఉండాలి. కార్మిక చట్టం ప్రమాణాలు పాటించాలి. డొమెస్టిక్ వర్కర్ పేరు, పని స్వభావం, సమయం, భత్యం, ఇతర ప్రయోజనాలు ఏంటనే విషయాలను అగ్రిమెంట్లో పేర్కొనాలి.
అదేవిధంగా పని గంటలు వారంలో 48 గంటలకు మించకూడదు. వారానికి ఒకపూర్తి సెలవు లేదా రెండు సగం సెలవులు ఇవ్వాలి. వార్షిక వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి ప్రయోజనాలు కల్పించాలి. కనీస వేతనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతనాలను యజమాని చెల్లించాలి. అదేవిధంగా మహిళా, పురుష కార్మికులకు వివక్ష లేకుండా వేతనాలు ఇవ్వాలి.
డొమెస్టిక్ వర్కర్లకు ఉపాధి కల్పించే ఏజెన్సీలు, సర్వీస్ ప్రొవైడర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పనివాళ్లను నియమించుకున్న నెలరోజుల్లో వారి వివరాలు నమోదుచేయాలి.