Unemployment | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెచ్చరిల్లుతున్నది. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారికి కూడా ఉపాధి అవకాశాలు లభించడం లేదు. ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసిన 83 శాతం మందికి ఇంకా ఉద్యోగాలు లభించ లేదని స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ ‘అన్‌స్టాప్’ తాజాగా విడుదల చేసిన టాలెంట్ రిపోర్ట్-2025లో వెల్లడైంది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన 46 శాతం మందికి కూడా ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు లభించ లేదని నివేదిక పేర్కొంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో పాటు ఉద్యోగ సంక్షోభం కూడా దీనికి కారణంగా నివేదిక అభిప్రాయపడింది.
దేశంలో చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25 శాతం మంది మాత్రమేనని ఎకనమిక్ సర్వేలో తేలింది. మిగతా 91.75 శాతం మంది తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు కాకుండా చిన్నాచితక పనుల్లో కొనసాగుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని 47 శాతం మందిలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) పేర్కొంది. యువతలో నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఐఎల్వో గుర్తు చేసింది.
ఉపాధి అవకాశాల కోసం చూసే పట్టభద్రుల కోసం బీజేపీ ప్రభుత్వం ‘స్కిల్ డెవలప్మెంట్’ పేరిట కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కార్మికులు, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 2015లో మోదీ ప్రభుత్వం పీఎం కౌశల్ వికాస్ యోజన స్కీమ్‌ను కూడా తెరమీదకు తెచ్చింది. 2015లో ‘స్కిల్ ఇండియా మిషన్’ను కూడా ప్రారంభించింది. అయితే, ఈ కార్యక్రమాలన్నీ ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యాయని, ఏ స్కీమ్ కూడా లక్ష్యాన్ని చేరుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే దేశంలో నిరుద్యోగం ఈ స్థాయిలో పెచ్చరిల్లే పరిస్థితులు ఉండేవి కాదని, యువతలో నైపుణ్యాలు పెరిగేవని చెప్తున్నారు. ‘అన్‌స్టాప్’ తాజా నివేదికను విశ్లేషిస్తే ఇది నిజమేనని అర్థమవుతున్నది.
ఇంజినీరింగ్ పూర్తైనా జాబ్ దొరకనివారు: 83%
బిజినెస్ గ్రాడ్యుయేట్లలో జాబ్ లేనివారు: 46%
దేశంలో చదువుకు తగ్గ ఉద్యోగం చేయనివారు: 91.75 %
కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు లేనివారు: 47%