హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ) : జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే లాభపడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంపీ స్థానాల విధానాన్నే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తకువగా ఉన్నదని తెలిపారు. 1971 జనాభా లెకలను పరిగణనలోకి తీసుకుని లోక్‌సభ స్థానాలను నిర్ణయించారని, ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగించాలని, అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్రానికి సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారని, ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నదని తెలిపారు.