Mamata Banerjee : మాల్దా జిల్లాలో ‘సర్ (SIR)’ విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ఆ అధికారుల నిర్బంధం గురించి తనకు తెలియదని, ప్రస్తుతం బెంగాల్ పాలన తన చేతుల్లో లేదని చెప్పారు. కాగా ఈ నెలలో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ఉన్నాయి. ఈ క్రమంలో అధికారుల నిర్బంధం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. సాగర్దిఘిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. అధికారుల నిర్బంధం తనకు తెలియదని, ప్రస్తుతం పాలన తన చేతుల్లో లేదని అన్నారు.
అధికారుల నిర్బంధానికి బాధ్యులు ఎవరో తనకు తెలియదని మమతాబెనర్జీ స్పష్టంచేశారు. ఈ విషయమై తనకు ఎవరూ సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు. పరిపాలన తన చేతుల్లో లేదని, శాంతిభద్రతలను ఎన్నికల సంఘం నియంత్రిస్తోందని తెలిపారు. వారంతా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట వింటున్నారని అన్నారు. అధికారులను కూడా కేంద్రం మార్చిందని ఆరోపించారు. తన అధికారాలన్నీ ఈసీ చేతిలోకి వెళ్లాయని అన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) పై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని మమతా బెనర్జీ చెప్పారు.
మాల్దాలో జరిగిన అధికారుల నిర్బంధం ఘటన బీజేపీ కుట్రలో భాగమని మమత ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికను రద్దు చేయించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. న్యాయాధికారులకు రక్షణ కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని విమర్శించారు. తనకు అర్ధరాత్రి సమయంలో ఒక జర్నలిస్టు ద్వారా నిర్బంధం విషయం తెలిసిందని వెల్లడించారు.