DK Shiva Kumar : కర్ణాటక (Karnataka) సర్కారులో త్వరలో నాయకత్వ మార్పు జరగబోతోందని, సిద్ధరామయ్య (Siddaramaiah) ను తొలగించి సీఎం పదవిని ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shiva Kumar) కు కట్టబెట్టబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా (Randeep Surjewala) బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కావడం ఆ ప్రచారానికి మరింత ఊపు తెచ్చింది.
దాంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆ ప్రచారాన్ని మొగ్గ దశలోనే తుంచేశారు. ప్రభుత్వంలో ఎలాంటి నాయకత్వ మార్పు ఉండబోదని చెప్పారు. తాను నాయకత్వ మార్పును కోరుకోవడం లేదని, ముఖ్యమంత్రి పదవి కోసం తనకు ఏ ఎమ్మెల్యే మద్దతు అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టంతా స్థానిక సంస్థల ఎన్నికలు, 2028లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉందన్నారు.
రణ్‌దీప్ సుర్జేవాలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమైంది ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై చర్చించేందుకు కాదని, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలపై చర్చించడానికని డీకే చెప్పారు. నాయకత్వ మార్పు జరగనుందంటూ ఎమ్మెల్యే ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. ఇకపై ఈ అంశాన్ని ప్రస్తావించే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.