న్యూఢిల్లీ: చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) పట్ల ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఈ కొత్త వైరస్ దేశంలోకి ప్రవేశించలేదని చెప్పారు. అయితే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాను ప్రస్తుతం కొత్త వైరస్ హెచ్ఎంవీపీ వణికిస్తున్నది. ఆ దేశ ప్రజలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్ పట్ల ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఈ వైరస్ కేసు నమోదు కాలేదని తెలిపారు.
కాగా, సాధారణ జలుబుకు కారణమయ్యే శ్వాసకోశ వైరస్ మాదిరిగానే హెచ్ఎంపీవీ ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధిపతి అయిన డాక్టర్ అతుల్ గోయెల్ తెలిపారు. ఈ వైరస్ వల్ల పిల్లలు, వృద్ధుల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. అయితే సాధారణంగా చలికాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి పెరుగుతుందని అన్నారు.
మరోవైపు దగ్గు లేదా జలుబు వంటి లక్షణాలు ఉంటే, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అతుల్ గోయెల్ తెలిపారు. ఇతరులకు దూరంగా ఉండాలని సూచించారు. జలుబు లేదా జ్వరానికి సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అయినప్పటికీ ఆసుపత్రులతోపాటు అత్యవసర వైద్య సామాగ్రిని సన్నద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.