న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈసారి రాష్ట్రపతి భవన్లో నిర్వహించే “ఎట్ హోమ్” వేడుకను రద్దు చేసినట్లు సమాచారం. సాధారణంగా స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరుగుతుంది. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సహా సుమారు రెండు వేల మందికి రాష్ట్రపతి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది.
కాగా, ఈ ఏడాది ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనైనా ‘ఎట్ హోమ్’ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే అది కూడా సాధ్యపడకపోవడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో నిర్వహించే “ఎట్ హోమ్” వేడుకను రద్దు చేసినట్లు రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్ సింగ్ తెలిపారు. మరోవైపు ‘ఎట్ హోమ్’ కార్యక్రమం రద్దు కావడం కూడా దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చని రాష్ట్రపతి భవన్ అధికారులు వెల్లడించారు.