న్యూఢిల్లీ, నవంబర్ 10: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానం వద్ద పరపతి కోల్పోయారా? నవంబర్ ‘విప్లవం’ ముంచుకొస్తున్న వేళ ముఖ్యమంత్రి ముఖం చూసేందుకు కూడా అధిష్టాన వర్గం ఇష్టపడడం లేదా? తాజా పరిణామాలతో ఈ సందేహాలు పలువురిలో తలెత్తుతున్నాయి. నవంబర్ 15న ఢిల్లీని సందర్శించనున్న సిద్ధరామయ్య అధిష్ఠానంతో సమావేశానికి అపాయింట్మెంట్ కోరగా పార్టీ నాయకత్వం దాన్ని నిర్దంద్వంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎటువంటి సమావేశానికి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రికి పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదే ఆదేశాలు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు అందరికీ వర్తిస్తాయని, ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం ఎవరూ కోరవద్దని అధిష్ఠానం ఆదేశించినట్లు వారు చెప్పారు. వేరే పని మీద ఢిల్లీకి వెళుతున్న సిద్ధరామయ్య పనిలోపనిగా పార్టీ నాయకత్వంతో భేటీకి సమయం కోరారు. ఇప్పుడు నేరుగా కలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదని, ఈ పరిస్థితిలో ఎవరితోనూ సమావేశమయ్యేది లేదని పార్టీ అధిష్ఠానం తెగేసి చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక చేసేది ఏమీ లేక ముఖ్యమంత్రి ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అదే రోజు బెంగళూరుకు తిరిగి వస్తున్నట్లు తెలిసింది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నవంబర్ 21 నాటికి రెండున్నరేళ్లు పూర్తి కానున్న సందర్భంగా నాయకత్వ మార్పు ఉంటుందని జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పార్టీకి చెందిన జాతీయ నాయకులు సైతం కర్ణాటక నాయకులతో మాట్లాడేందుకు ఇష్టపడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాగా, విజయనగర జిల్లాలో ఓ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రభుత్వం పూర్తికాలం మనుగడ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీనే మరోసారి ఆశీర్వదిస్తారని జోస్యం చెప్పారు.
సిద్ధరామయ్య అనుకూల వర్గ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిత్నల్ తన సోదరుడు, కొప్పల్ ఎంపీ రాజశేఖర్ హిత్నల్ నివాసంలో ఆదివారం ఓ విందు సమావేశం నిర్వహించారు. సిద్ధరామయ్య శిబిరంలోని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విందులో పాల్గొన్నారు. తమ బలాన్ని నిరూపించుకునే ఉద్దేశంతోనే సిద్ధరామయ్య శిబిరం ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఉప ముఖ్యమంత్రి, నవంబర్ విప్లవంలో ప్రధాన లబ్ధిదారుడిగా ప్రచారంలో ఉన్న డీకే శివకుమార్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఓటు చోరీ వ్యవహారంపై అధిష్ఠాన వర్గంతో భేటీ కోసం ఆయనకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజుల్లో అధిష్ఠానం నుంచి పిలుపు రావడం ఇది రెండవసారి. డీకేకి మాత్రం నో ఎంట్రీ బోర్డు లేకపోవడం ఆయన వ్యతిరేక వర్గానికి కంటగింపుగా మారినట్లు తెలుస్తోంది.