న్యూఢిల్లీ: చికిత్స విషయంలో వైద్యుల నిర్లక్ష్యం, వృత్తిలో అనుచిత వైఖరి తదితర అంశాలపై రోగులు ఇచ్చే ఫిర్యాదులను నేరుగా వినాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అలాగే రాష్ట్ర వైద్య మండలి (ఎస్ఎంసీ) నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా ఎన్ఎంసీ ఆధ్వర్యంలోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు (ఈఎంఆర్బీ)కి రోగులు ఫిర్యాదు చేయవచ్చు.
2023లో జరిగిన సమావేశంలో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని, అయితే దీనిని అధికారికంగా ఆమోదించాల్సి ఉందని ఎన్ఎంసీ కార్యదర్శి బీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్ఎంసీ చట్టం 2019 ప్రకారం ఎస్ఎంసీలకు ఫిర్యాదు చేయడానికి, వాటి నిర్ణయాలపై ఈఎంఆర్బీలలో అప్పీల్ చేయడానికి వైద్య వృత్తి నిపుణులు మాత్రమే అర్హులు. అయితే గత ఏడాది జరిగిన సమావేశంలో వైద్య సేవల్లో అసంతృప్తి, సేవా లోపాలపై రోగులకు సైతం ఫిర్యాదు చేసే హక్కు ఉండాలని భావిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.