పాట్నా: బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి తన మంత్రివర్గాన్ని గురువారం విస్తరించనున్నారు. మాజీ సీఎం నితీశ్ కుమార్ కుమారుడైన నిశాంత్ కుమార్కు (Nishant Kumar) కేబినెట్లో చోటుదక్కినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ గత నెలలో రాజ్యసభకు ఎన్నిక కావడంతో బీహార్ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15న బీహార్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం తన మంత్రివర్గాన్ని ఆయన విస్తరిస్తున్నారు. మొత్తం 27 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఈ ఏడాది మార్చిలో జేడీ(యూ)లో చేరిన నితీశ్ కుమార్ కుమారుడైన నిశాంత్ కుమార్ గురువారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ మంత్రివర్గంలోకి నిశాంత్ కుమార్ ప్రవేశాన్ని రాజకీయంగా అత్యంత కీలకమైన పరిణామంగా పరిగణిస్తున్నారు. జేడీ(యూ)లో ఒక తరం మార్పు, వారసత్వ రాజకీయాలకు సంకేతంగా దీనిని భావిస్తున్నారు.
మరోవైపు ఎన్డీయే మిత్రపక్షాల మధ్య సమతుల్యమైన అధికార భాగస్వామ్య సూత్రాన్ని మంత్రివర్గం విస్తరణలో అనుసరిస్తున్నట్లు సమాచారం. అతిపెద్ద ఏకైక పార్టీ అయిన బీజేపీకి 12, జేడీ(యూ)కు 11 మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు మూడు, హిందుస్తానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ జనతా దళ్ వంటి చిన్న మిత్రపక్షాలకు ఒక్కో మంత్రి పదవి లభించవచ్చని తెలుస్తున్నది.