RJD posters | రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజయం సాధిస్తున్నట్లు తెలిపే పోస్టర్లు పట్నాలో వెలిశాయి. ఈ పోస్టర్లు ఆర్జేడీ కార్యకర్తలు రబ్రీ దేవి నివాసంతోపాటు ఆర్జేడీ కార్యాలయం వద్ద వెలిశాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమిని, మహాకూటమి విజయాన్ని వివరించేలా రామాయణం, మహాభారతంను తీసుకుని వాటితో ఆర్జేడీ, బీజేపీని పోల్చారు. అయితే, ఈ పోస్టర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి స్పష్టం చేయడం విశేషం.
రామాయణంలో రావణుడిపై రాముడు.. మహాభారత్‌లో కంసుడిపై కృష్ణుడు విజయం సాధించాడు.. రానున్న 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీపై నితీష్ కుమార్ విజయం సాధిస్తాడు.. అని అర్థం వచ్చేలా పోస్టర్లను తయారుచేశారు. నరేంద్ర మోదీని రావణుడు, కంసుడితో సంబోధిస్తూ.. నితీష్ కుమార్‌ను రాముడు, కృష్ణుడిగా అభివర్ణించారు. ఈ పోస్టర్లను రాష్ట్ర ఆర్జేడీ ప్రధాన కార్యదర్శి పూనమ్ రాయ్ ముద్రించగా.. మహాగట్బంధన్ జిందాబాద్ అనే నినాదాలు కూడా ఉన్నాయి.
ఈ పోస్టర్లు ఎవరు పెట్టారో తెలియదని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని, బిహార్‌లో దీనికి నితీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారని ఆయన తెలిపారు. పేదలు, యువత, రైతులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీపై అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయని తివారి పేర్కొన్నారు. కాగా, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుకాకుండా ఉండేందుకు రామ్చరిత్ మానస్‌పై విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అధికార జేడీయూ సూచించింది.