Nitin Gadkari : ఒకపక్క దేశంలో ఈ20 పెట్రోల్‌పై చర్చ జరుగుతుండగానే కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యూటనాల్ కలిపేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించాలని, ఆధునిక స్వచ్ఛమైన చమురును వాడాలనే కేంద్ర లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గడ్కరీ వెల్లడించారు. చమురు దిగుమతుల్ని తగ్గించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, పెట్రోల్‌లో కలిపినట్లుగా ఇథనాల్‌ను డీజిల్‌లో నేరుగా కలపడానికి వీలుకాదు. అందువల్ల ఇథనాల్ నుంచి ఐసోబ్యూటనాల్‌ను ఉత్పత్తి చేస్తారు. దీన్ని డీజిల్‌లో కలుపుతారు. త్వరలో డీజిల్‌లో ఐసోబ్యూటనాల్‌ను 15 శాతం కలపబోతున్నారు. అంటే, ఇకపై పూర్తి డీజిల్ కాకుండా.. 85 శాతం డీజిల్, 15 శాతం ఐసోబ్యూటనాల్ కలిపిన చమురు అందుబాటులోకి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఐసోబ్యూటనాల్‌ను డీజిల్‌కు పూర్తి ప్రత్యామ్నాయంగా కూడా వాడుకోవచ్చని గడ్కరీ అన్నారు. ప్రస్తుతం ఐసోబ్యూటనాల్ మిక్సింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, దేశీయ చమురు భద్రతలో ఇదో కీలక ముందడుగు అని గడ్కరీ అభివర్ణించారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రస్తుతం దీన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే రెండు జనరేటర్లను ఇలా విజయవంతంగా వాడినట్లు చెప్పారు. డీజిల్‌లో ఐసోబ్యూటనాల్ కలపడం వల్ల డీజిల్ వినియోగం తగ్గుతుందని, దీనివల్ల విదేశాల నుంచి క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతాయన్నారు.
ఇటీవలి కాలంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతూ కేంద్రం చేపట్టిన చర్యల వల్ల రూ.1.9 లక్షల కోట్ల విదేశీ మారక నిధులు మిగిలాయిన నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనివల్ల కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయన్నారు. అయితే, కేంద్ర నిర్ణయంపై ప్రజల నుంచి, నిపుణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని, త్వరగా పాడయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.