Nitin Gadkari | నాగ్‌పూర్, ఏప్రిల్ 1: దేశంలో డీజిల్, పెట్రోల్ కార్ల వాడకానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పింది సాధించడం కష్టమే కానీ… అసాధ్యం మాత్రం కాదన్నారు. ‘వంద శాతం’ సాధ్యమేనని విశ్వాసం వ్యక్తం చేశారు! ప్రజలు, పరిశ్రమల ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పులను ఇందుకు ఉదహరించారు. ఇందుకోసం హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని ఆయన కోరారు. పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
‘మన పొరుగు ఇండ్లలో ఇప్పుడు చాలా ఎలక్ట్రిక్ కార్లు కనిపిస్తున్నాయి. ఇది అసాధ్యం అనుకున్న ప్రజలే తమ ఆలోచనను మార్చుకొన్నారు’ అని గడ్కరీ అన్నారు. టాటా, అశోకా లేల్యాండ్ కంపెనీలు హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులను ప్రవేశపెట్టాయని, ఎల్ఎన్జీ లేదా సీఎన్జీతో నడిచే ట్రక్కులు కూడా ఉన్నాయని గడ్కరీ తెలిపారు. అయితే పెట్రో వాహనాలకు పూర్తిగా స్వస్తి పలకడం ఎప్పుడు సాకారమవుతుందో ఆయన కచ్చితంగా చెప్పలేకపోయారు.