Nita Ambani : తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) గుజరాత్‌లోని తమ పూర్వీకుల స్వస్థలమైన జామ్‌నగర్ (Jam Nagar) నుంచి శ్రీకృష్ణుడి దివ్యక్షేత్రమైన ద్వారక (Dwarka) కు పాదయాత్ర చేయడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ (Nita Ambani) సంతోషం వ్యక్తంచేశారు. అనంత్ అంబానీ ఆదివారం ద్వారకకు చేరుకొని శ్రీ కృష్ణుడిని దర్శించుకోవడం ద్వారా తన పాదయాత్రను ముగించారు. అనంతరం శ్రీరామ నవమిని పురస్కరించుకొని తల్లి నీతా అంబానీ, భార్య రాధికా మర్చంట్ (Radhika Merchant) తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రలో తనకు తోడుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయంపై నీతా అంబానీ మాట్లాడుతూ.. తన కుమారుడు పది రోజులపాటు పాదయాత్ర చేసి ద్వారకకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక తల్లిగా తనకు ఇది గర్వించదగ్గ సందర్భమని వ్యాఖ్యానించారు. అనంత్ అంబానీతోపాటు పాదయాత్రలో పాల్గొన్న యువకులంతా దేశ సంస్కృతిని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా అనంత్‌కు మరింత బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు నీతా అంబానీ పేర్కొన్నారు.
అనంత్ అంబానీ జామ్‌నగర్ నుంచి ద్వారకకు 170 కిలోమీటర్ల పాదయాత్రను మార్చి 29న ప్రారంభించారు. రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున నడిచారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో ఏడు గంటల చొప్పున నడుస్తూ మార్గమధ్యలో ఎదురయ్యే ప్రజలతో మాట్లాడుతూ ముందుకుసాగారు. ఈ యాత్రలో ఎక్కడికక్కడ స్థానికులు సైతం ఆయనకు సంఘీభావంగా నడిచారు. హనుమాన్ చాలిసా, సుందరకాండ, దేవీ స్తోత్రాలను వల్లె వేస్తూ ఈ ఆధ్యాత్మిక పాదయాత్రను అనంత్ ముగించారు.