Nishikant Dubey : బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ ఓ షార్ట్ ఆర్డర్‌ను పాస్ చేస్తామని వెల్లడించింది. వక్ఫ్ సవరణ చట్టం, బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుచేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టుపై దూబే చేసిన వ్యాఖ్యలు పూర్తిగా న్యాయవ్యవస్థను అవమానించేలా ఉన్నాయని, కాబట్టి అతడిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని న్యాయవ్యవస్థను కోరారు. కాగా ఈ పిటిషన్‌ను స్వీకరించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టంచేశారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై ఓ షార్ట్ ఆర్డర్‌ను పాస్ చేసి కారణాలను నమోదు చేయాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలుపడానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు మూడు నెలల గడువు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అయితే ఈ పరిణామాలపై ఉప రాష్ట్రపతి అభ్యంతరం వ్యక్తంచేశారు.
రాష్ట్రపతి ఫలానా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించజాలదన్నారు. ప్రజాస్వామ్య శక్తులపై అణు క్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పలువురు బీజేపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలని దూబే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
దాంతో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ వ్యాఖ్యానించింది. బీజేపీ న్యాయవ్యవస్థను గౌరవిస్తుందని, దూబే వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సైతం దూబే వ్యాఖ్యలను ఖండించింది. ఆయన వ్యాఖ్యలు కేవలం పరువు నష్టం కలిగించేవి కాదని, కోర్టు ధిక్కారంతో సమానమని తెలిపింది.