పుణె: డిజిటల్ అరెస్ట్ కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. పుణె నగర సైబర్ పోలీసుల కథనం ప్రకారం, మాజీ ఎల్ఐసీ అధికారిణి (62)ని గత నెల చివరి వారంలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.99 లక్షలు దోచుకున్నారు. మొదట ఓ వ్యక్తి తాను డాటా ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నానంటూ ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్ మోసపూరిత లావాదేవీల కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు ఆ వ్యక్తి ఆరోపించాడు.
ఆమెను వేరొక వ్యక్తికి కనెక్ట్ చేశాడు. ఆ రెండో వ్యక్తి మాట్లాడుతూ, తాను సీనియర్ పోలీస్ అధికారి జార్జ్ మాథ్యూనని చెప్పాడు. వీడియో కాల్లో మాట్లాడుతూ, ‘మీరు మనీలాండరింగ్ చేస్తున్నారు, మీ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేస్తాం’ అని బెదిరించాడు. తన వాదనకు బలం చేకూర్చడం కోసం ఆమెకు ఓ అరెస్ట్ వారంట్‌ను పంపించాడు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆ వారంట్ మీద పెట్టాడు. ప్రభుత్వ రాజముద్రగా కనిపిస్తున్న దానిని ముద్రించాడు. వయసును దృష్టిలో ఉంచుకుని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పాడు. అతని మాటలను నమ్మిన బాధితురాలు రూ.99 లక్షలను వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు.