న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సమావేశాల కోసం కంచిపట్టు చీర ధరించారు. తమిళనాడుకు చెందిన చేనేత వస్త్ర సంస్కృతికి కంచీపురం సిల్క్ ప్రతిబింబమైన విషయం తెలిసిందే. సంప్రదాయమైన కంచీ పట్టు చీరలో మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. పర్పుల్ కలర్లో ఆ పట్టు చీర ఉన్నది. లైట్ గోల్డెన్ బ్రౌన్ చెక్స్ ఆ చీరపై నేశారు. తమిళంలో ఆ చెక్స్‌ను కట్టం అని పిలుస్తారు. కాఫీ బ్రౌన్ బోర్డర్ లో ఉన్న ఆ చీరకు త్రెడ్ వర్క్ చేశారు. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ వస్త్రధారణలో మంత్రి నిర్మల ఆకర్షణీంగా తయారయ్యారు.
9వ సారి మంత్రి నిర్మల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అయితే ప్రతిసారి ఆమె ప్రత్యేక చీరకట్టులో పార్లమెంట్‌కు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం వేళ ఆమె వేషధారణ అందర్నీ ఆకట్టుకునేది. అయితే స్థానిక చేనేతను ప్రోత్సహించే రీతిలో అనేక ప్రాంతాలకు చెందిన చీరలను ఆమె పలు సందర్భాల్లో ధరించారు. 2025లో మంత్రి నిర్మలా సీతారామన్ .. బీహార్‌కు చెందిన మధుబని ఆర్ట్ శారీలో దర్శనం ఇచ్చారు. హ్యాండ్లూమ్ పట్టు చీరకు పేరుగాంచిన మధుబని డిజైన్‌లో ఆమె గత ఏడాది బడ్జెట్‌ను ప్రజెంట్ చేశారు. బీహారీ జానపదులకు నివాళిగా ఆ చీరను పద్మశ్రీ గ్రహీత దులారీ దేవి ఆ చీరను మంత్రి నిర్మలకు గిఫ్ట్‌గా ఇచ్చారు. కచ్ని లైన్ స్కెచింగ్, భర్ని కలర్ స్టయిల్స్‌తో ఆ చీరను తయారు చేశారు.
2024లో మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలో మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను చదివారు. తెలుపు రంగు చీరకు.. బ్రైట్ మెజెంటా బోర్డర్ ఉంది. ఫైన్ కాటన్, సింపుల్ జరీ బోర్డర్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి చెందిన చేనేత కార్మికులు ఆ చీరను రూపొందించారు. ఇక ఏడాది మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో మంత్రి నిర్మల.. బెంగాల్‌కు చెందిన తుషార్ పట్టు చీరను కట్టుకున్నారు. స్టోరీటెల్లింగ్ ప్యాటర్న్ ఆ పట్టుచీరలో ప్రత్యేకమైన అంశం. 2023లో టెంపుల్ బోర్డర్ సిల్క్ చీరతో ఆమె పార్లమెంట్‌కు వచ్చారు. ఒడిశాకు చెందిన బొమ్కాయి చీరకట్టుతో ఆమె 2022లో బడ్జెట్‌ను చదివారు. ఇక 2021లో తెలంగాణకు చెందిన పోచంపల్లి పట్టుచీరలో మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగానికి హాజరయ్యారు. 2020లో బ్లూ బోర్డర్ ఉన్న పసుపు రంగు సిల్క్ చీరలో ఆమె బడ్జెట్‌కు వచ్చారు. 2019లో పింక్ కలర్ మంగళగిరి చేనేత చీరను ధరించారు.