న్యూఢిల్లీ, జూలై 6: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బడ్జెట్ సమావేశాల కోసం ఉభయ సభలను సమావేశపరిచే ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. మోదీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. కాగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
పసికందు ప్రాణం తీసిన డాక్టర్ నిర్లక్ష్యం
దావణగెరె: ఆపరేషన్ సమయంలో ఓ డాక్టర్ నిర్లక్ష్యం పసికందు ప్రాణం తీసింది. సిజేరియన్ ఆపరేషన్ సమయంలో డాక్టర్ మగ బిడ్డ జననేంద్రియాలను కోయడంతో ఆ పసికందు గాయాలతో మరణించిన ఘటన కర్ణాటకలోని దావణగెరెలో చేటుచేసుకుంది. అమృత అనే గర్భవతి ప్రసవం కోసం జూన్ 17న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సాధారణ ప్రసవం కాకపోడంతో సిజేరియన్ చేశారు. డాక్టర్ నిజాముద్దీన్ నిర్లక్ష్యంగా వ్యవహరించి బిడ్డ జననేంద్రియాలను కోసేశాడు. పసికందును ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అక్కడ మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బాధితుల బంధువులు ఆందోళన చేశారు.
కోటీశ్వరుడైన గజదొంగ అరెస్ట్
ముంబై, జూలై 6 (నమస్తే తెలంగాణ): విమానాల్లో తిరుగుతూ, విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తూ. తెలంగాణ, ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న ఘరానా గజ దొంగ రోహిత్ సోలంకిని వల్సాద్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. అతడిని కోటీశ్వరుడుగా గుర్తించిన పోలీసులు షాక్ తిన్నారు. అతడికి ముంబై, బాంద్రాలో కోటి రూపాయలకు పైగా విలువైన విలాసవంతమైన ఫ్లాట్‌తో పాటు ఆడి కారు కూడా ఉందని విచారణలో తేలింది.
చైనాపై ‘జోర్వార్’ గురి!
న్యూఢిల్లీ: రెండేండ్ల వ్యవధిలో డీఆర్డీవో సైంటిస్టులు దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత తేలిక రకం యుద్ధ ట్యాంక్ ‘జోర్వార్’ (25 టన్నులు) ట్రయల్స్‌కు సిద్ధమవుతున్నది. ఈ ప్రాజెక్ట్‌లో తొలి యుద్ధ ట్యాంక్‌ను డీఆర్డీవో చీఫ్ వీ కామత్ శనివారం ఆవిష్కరించారు. వీటిని లడఖ్‌లో చైనా సరిహద్దు వెంబడి మోహరించనుంది. ప్రాథమికంగా 59 ‘జోర్వార్’లను భారత సైన్యానికి అప్పగిస్తారు.
మూక హత్యలకు వ్యతిరేకంగా కఠిన చట్టం తేవాలి
న్యూఢిల్లీ: మూక హత్యలు, విద్వేష నేరాలకు వ్యతిరేకంగా కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని ఏఐకేఎస్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. గత నెల ఛత్తీస్‌గఢ్‌లో మూక హత్యకు గురైన యూపీకి చెందిన ముగ్గురు పశువుల రవాణా వ్యాపారులకు చెందిన కుటుంబసభ్యులను ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నేతల బృందం శుక్రవారం పరామర్శించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల మూడు రోజుల తర్వాత జూన్ 7న ఈ హత్యలు జరిగాయని, ఆ తర్వాత పలు రాష్ర్టాల్లోనూ ముస్లింలపై సంఘ్ పరివార్ శక్తులు దాడులు చేశాయని ఏఐకేఎస్ పేర్కొన్నది.