న్యూఢిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను (Union Budget) ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభ ముందుంచుతారు. దీంతో ఆమె మరో చరిత్ర సృష్టించనున్నారు. 2019లో ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తాత్కాలిక బడ్జెట్లతో కలిపి వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ను (వరుసగా 6 సార్లు) అధిగమించారు. శనివారం ఎనిమిదో దానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఆమె మరో మైలురాయిని అందుకోనున్నారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమం చేయనున్నారు. ఇప్పటివరకు అత్యధికంగా 10 సార్లు మొరార్జీ దేశాయ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, పీ. చిదంబరం 9 సార్లు బడ్జెట్ సమర్పించారు.
కాగా, శుక్రవారం రోజు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో వేతన జీవులు, మధ్యతరగతి వర్గాల్లో ఆశలు పెంచుతున్నాయి. పేదలు, మధ్యతరగతిపై మహాలక్ష్మి కటాక్షం చూపించాలని వ్యాఖ్యానించడంతో.. బడ్జెట్లో వారికి కేంద్రం పెద్దపీట వేసినట్లు సర్వత్రా చర్చ జరుగుతున్నది. 2014 నుంచి పన్నుల శ్లాబులు మార్చకపోవడం, నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో వాటికి అనుగుణంగా జీతాలు పెరగని నేపథ్యంలో ఈ దఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా పన్ను ప్రయోజనాలు, కొత్త పథకాలు ఉండొచ్చని అనుకుంటున్నారు. శుక్రవారం నాటి ఆర్థిక సర్వే కూడా ఇదే విధమైన సంకేతాలిచ్చింది.