Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రికార్డు సృష్టించారు (make history). ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ నిర్మలమ్మ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వరుసగా ఏడవ సారి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. తద్వారా వరుసగా ఏడుసార్లు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఆరు వార్షిక బడ్జెట్లు ప్రవేశ పెట్టిన రికార్డు నమోదైంది. 1959-64 మధ్య ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌ను మొరార్జీ దేశాయ్ ప్రవేశ పెట్టారు.
2019లో నరేంద్రమోదీ సారధ్యంలో రెండో దఫా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకూ వరుసగా ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లను కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరి ఒకటో తేదీన తాత్కాలిక బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించారు. తాజాగా మంగళవారం బడ్జెట్ సమర్పించడంతో మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా సీతారామన్ బ్రేక్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్.. కార్పొరేట్ సంస్థలు, కార్మిక, రైతు సంఘాలు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో పలు దఫాలు చర్చలు జరిపారు.
ఇక ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం మొదలైన విషయం తెలిసిందే. నిన్న పార్లమెంట్లో నిర్మలమ్మ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఆగస్టు 12 వరకూ కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో ఎయిర్ క్రాఫ్ట్ చట్టం, జమ్ముకశ్మీర్ బడ్జెట్, ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య చట్టం, భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు, కాఫీ (ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు, రబ్బర్ (ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్) బిల్లు తదితర ఆరు బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదింప చేసుకోవాలని తలపోస్తున్నది.
కాగా, మోదీ తొలి విడుత మంత్రి వర్గంలో (2014) పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు నరేంద్రమోదీ. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడుత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.
Also Read..
Budget 2024 | బడ్జెట్‌కు ముందు.. నిర్మలమ్మ నోరు తీపి చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Nirmala Sitharaman | బడ్జెట్ డాక్యుమెంట్స్‌తో పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలమ్మ టీం
KTR | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం.. ఎప్పటిలానే ఈసారీ గుండుసున్నానే!: కేటీఆర్