Trolls on Nirmalamma | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. తన వ్యాఖ్యల కారణంగా తరచుగా న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటారు నిర్మలమ్మ. ఆమె ఎప్పుడు మాట్లాడుతుందా అని విమర్శించేందుకు ప్రతిపక్షాలు ఎదురుచూస్తుంటాయి. ఆర్థిక మంత్రిగా ఆమెకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎక్కువే.
రూపాయి బలహీనపడలే..
నిర్మలా సీతారామన్ 2022లో అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ గురించి ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. ‘రూపాయి బలహీనపడిందని ఎవరు చెప్పారు. డాలర్ బలపడుతున్నదంతే. అలాగే నేను చూస్తున్నాను’ అని సమాధానమిచ్చారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు, నెటిజెన్లు సోషల్ మీడియాలో ఆమెను లెక్కలేనంతగా ట్రోల్ చేశారు.
అది దేవుడి చర్యే..
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రపంచదేశాలన్నీ కష్టాలను ఎదుర్కొన్నాయి. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోపం కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. 2020 లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో ఉపాధి, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి కొవిడ్‌పై తన కోపాన్ని ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా ఇది ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటనపై విపక్షాలే కాకుండా ట్విట్టర్లో నెటిజెన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అయితే ప్రభుత్వంతో మాకు అవసరం ఏంటి అని చాలా మంది ప్రశ్నించారు. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ లోపభూయిష్ట నిర్వహణ అని ఎలా చెప్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
వెజిటేరియన్‌ను.. ఉల్లిగడ్డ తినను..
2019లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉల్లిగడ్డలతోపాటు నిత్యవసరాల ధరల పెరుగుదలపై, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆ సమయంలో నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ‘నేను వెజిటేరియన్‌ను. వెల్లుల్లి, ఉల్లి తినను. ఉల్లిపాయలను తినని ఇంటి నుంచి నేను వచ్చాను’ అని చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల కామెంట్లు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.
అవి కథా ఉపనిషద్లోనివండీ..
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 2020 లో యువతకు సూచనలు చేస్తున్నట్లుగా ‘అవేక్.. అరైజ్. అండ్ డ్రీమ్ నో మోర్!..’ అంటూ ఒక పోస్ట్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ట్విట్టర్లో కొన్ని రోజులపాటు ట్రోల్స్ నడిచాయి. సంజయ్ ఘోష్ అనే ట్విట్టర్ వినియోగదారుడు ‘మీరు చేసిన కొటేషన్ వివేకానందుడిది కాదు.. వాటిని కథా ఉపనిషద్లో నుంచి తీసుకున్నారు. అయితే, వివేకానందుడి రెండు మాటలను ముందు జోడించారంతే..’ అంటూ ఘాటుగా స్పందించడంతో నిర్మలమ్మ వ్యాఖ్యల తీరు బయటపడింది.