Nipah Virus | దేశంలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కేరళలో మరో కొత్త కేసు నమోదైంది. వైరస్ సోకిన 23 సంవత్సరాల వ్యక్తిగత సోమవారం మృతి చెందాడు. ఈ క్రమంలో వైరస్‌ని అదుపులో చేసేందుకు అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లాలో మరోసారి మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మాస్క్ నిబంధన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అయితే, పుణేలోని వైరాలజీ నమూనాలను పంపగా.. నిఫా పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు. మృతుడితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక కేరళలో ఇప్పటి వరకు 2018 నుంచి ఆరు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 150 మందిని అబ్జర్వేషన్లో పెట్టగా.. ఇద్దరిలో జ్వరం లక్షణాలు ఉన్నట్లు సమాచారం.
నిపా వెలుగు చూసిన నేపథ్యంలో ప్రోటోకాల్ మేరకు కఠిన నిబంధనలు అమలులోకి తీసుకువచ్చారు. తిరువలి పంచాయతి పరిధిలో ఉన్న నాలుగు సినిమా థియేటర్లు, విద్యాసంస్థలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. ఒకేచోట జనం గుమిగూడొద్దని అధికారులు తెలిపారు. నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఇది జునోటిక్ వైరస్. ఈ వైరస్‌ను తొలిసారిగా 1999లో గుర్తించారు. వైరస్ ఫ్రూట్ బ్యాట్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. వాటిపై వైరస్ ఎలాంటి ప్రభావం చూపదు. కానీ.. బ్యాట్స్ పండ్లను కొరికిన సమయంలో వాటిని జంతువులు తిన్న సందర్భాల్లో వైరస్ ప్రవేశిస్తుంది. జంతువుల నుంచి మనుషులకు సోకేందుకు అవకాశం ఉంటుంది.