Shama Mohamed : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాలా లావుగా ఉన్నాడని, ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉందని, ఆయనది ఆకట్టుకునే ఆకారం కాదని, భారత జట్టు మాజీ కెప్టెన్లు కపిల్‌దేవ్, సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ, కోహ్లీలతో పోల్చితే రోహిత్ ఒక సాధారణ ఆటగాడని మాజీ స్పోర్ట్స్ జర్నలిస్ట్, కాంగ్రెస్ మహిళా నేత షామా మహ్మద్ (Shama Mohamed) చేసిన బాడీ షేమింగ్ (Body shaming) కామెంట్స్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
షామా మహ్మద్ కామెంట్స్‌పై బీజేపీ కౌంటర్ ఎటాక్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 90 ఎన్నికల్లో ఓడిపోయినా రాహుల్‌గాంధీ కెప్టెన్సీ మిమ్మల్ని ఆకట్టుకుంది గానీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం ఆకట్టుకునేలా లేదా..? అని ప్రశ్నించింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి క్వశ్చన్ చేశారు. రాహుల్ గాంధీ కెప్టెన్సీలో ఢిల్లీ ఎన్నికల్లో మూడు సార్లు డకౌట్ అయినవాళ్లు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని మరో బీజేపీ నేత షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు.
అయినా తాను చేసిన కామెంట్స్‌ను షామా మహ్మద్ సమర్థించుకున్నారు. విమర్శలకు బదులిస్తూ.. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకున్నారు. రోహిత్ ఫిట్నెస్ గురించి తాను సాధారణ ట్వీట్ మాత్రమే చేశానని, అది బాడీ షేమింగ్ కాదని తెలిపారు. ఒక క్రీడాకారుడు ఫిట్‌గా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని, రోహిత్ కొంచెం బరువుగా ఉన్నాడు కాబట్టి ఆవిధంగా ట్వీట్ చేశానని చెప్పారు. తన పోస్టులో తప్పేముందని ప్రశ్నించారు.