గోపాల్‌గంజ్: సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కాటుకు తొమ్మది మంది బలయ్యారు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బీహార్ గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉండటంతో రహస్యంగా కల్తీ మద్యం దందా కొనసాగుతున్నది.
ఈ క్రమంలో గోపాల్‌గంజ్‌లోని ఓ వ్యక్తి ఇంట్లో బుధవారం 16 మంది కల్తీ మద్యం సేవించారు. ఆ తర్వాత కాసేపటికే ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. సాయంత్రానికి మరో వ్యక్తి మరణించాడు. మిగిలిన వారంతా అస్వస్థతకు గురయ్యారు. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ వైద్య బృందంతో అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఇవాళ బాధితుల్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 9కి చేరింది. మరో ఏడుగురికి చికిత్స కొనసాగుతున్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, బీహార్‌లో గత నెల 24 నుంచి ఇప్పటివరకు కేవలం 11 రోజుల వ్యవధిలో మూడుచోట్ల కల్తీ మద్యం చావులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 24న సివాన్‌లో కల్తీ మద్యం సేవించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆ ఘటనను మరువకముందే ముజఫర్‌పూర్‌లోని సరయ్యా ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి అక్టోబర్ 28, 29 తేదీల్లో 8 మంది మృతిచెందారు. ఇప్పుడు గోపాల్‌గంజ్‌లో ఏకంగా 9 మంది కల్తీ మద్యం కాటుకు బలయ్యారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.