గాంధీనగర్ : గుజరాత్లోని మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో ఇప్పటి వరకు 141 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వంతనపై రద్దీ కారణంగానే కేబుల్ బ్రిడ్జి తెగిపోయిందని దేశ అత్యున్నత ఫోరెస్సిక్ లాబోరేటరీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటన జరిగిన అనంతరం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో వంతెన నిర్వహణ కాంట్రాక్టు తీసుకున్న ఒరేవా సంస్థ నిర్వాహకులు, టికెట్ కలెక్టర్లు, కాంట్రాక్టర్లతో పాటు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు తెలుస్తున్నది. వీరిపై నేరపూరిత హత్యతో పాటు పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు పేర్కొన్నారు.
ఘటనపై పూర్తి సమాచారం అందిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని రాజ్కోట్ రేంజ్ ఐజీ అశోకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మోర్బీ పట్టణంలో మచ్చునదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన తీగల వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. మరమ్మతుల కారణంగా గత మార్చిలో మూసివేయగా.. ఐదు రోజుల కిందట ప్రజల సందర్శనార్థం తెరిచారు. వంతెన వద్ద సందర్శకులను అనుమతించే సమయంలో మున్సిపాలిటీ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. సర్టిఫికెట్ జారీ కంటే ముందే వంతెనపైకి సందర్శకులను అనుమతి ఇవ్వడం, పెద్ద ఎత్తున చేరుకోవడంతో వంతెన కూలిపోయింది.
ఘటన జరిగిన సమయంలో వంతెనపై 500 మంది వరకు ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రమాదంలో 141 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే, 15 సంవత్సరాల పాటు వంతెన నిర్వహణ బాధ్యతలను ఒరేవా కంపెనీ ఇవ్వగా.. ఈ ఏడాదిలోనే మోర్బీ మున్సిపల్, కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2037 వరకు చెల్లుబాటులో ఉండనున్నది. అధికారుల అనుమతి లేకుండానే వంతెనను పునరుద్ధరించారని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయలేదని, పెద్ద మొత్తంలో ఇంతకు ముందు వంతెనపైకి సందర్శకులు వెళ్లలేదని తెలిపారు.