Delhi Police : ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు కలిగిన, అలాగే ముంబై అండర్‌వరల్డ్‌తో సంబంధాలు కలిగిన 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీ ఆయుధాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.
పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ సంస్తతోపాటు ముంబై అండర్‌వరల్డ్‌తో సంబంధాలు కలిగిన తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఢిల్లీ, పంజాబ్, ముంబైలలో ఏకకాలంలో దాడులు జరిపి వీరిని అరెస్టు చేశారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా దేశంలోని కీలక ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నినట్లు సమాచారం. అంతేకాలు పలు ఆస్తులు, నిర్మాణాల్ని ధ్వంసం చేయడం, పోలీసులు సహా భద్రతా బలగాలపై దాడులు చేయడం వంటి కుట్రలకు ప్లాన్ చేశారు. ఢిల్లీ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిందితుల నుంచి భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రెనేడ్లు, తుపాకులు వంటి ఆయుధాలు లభించాయి.
వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించారు. నిందితులు అందరికీ ముంబై అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయి. వీరి నెట్వర్క్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వీరికి నిధులు ఎలా సమకూరాయి, ఆయుధాల రవాణా ఎలా చేశారు, ఎవరు సహకరించారు వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో ఎవరెవరు ఏ కుట్ర పన్నారో ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా వీరంతా పని చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి అందిన సమాచారం మేరకు వీరు లక్ష్యంగా ఎంచుకున్న ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.