NIA : కశ్మీర్‌లోని బైసరన్ లోయలో ఎనిమిది నెలల క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడి (Pahalgham Attack)లో పాకిస్థాన్ ప్రమేయం ఉందనే వార్త నిజమైంది. 26 మంది పర్యటకులను బలిగొన్న దాడికి లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) అగ్రనేత సూత్రధారి అని జాతీయ దర్యాప్తు (NIA) సంస్థ తెలిపింది. యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ నరమేధానికి లష్కరే నేత ప్రణాళిక రచించాడని, ది రెసిస్టంట్ ఫ్రంట్ (RTF) ఉగ్రవాదులు అమలు చేశారని ఎన్ఐఏ సోమవారం చార్జ్‌షీట్‌లో వెల్లడించింది.
పహల్గాం దాడితో సంబంధమున్న ఏడుగురిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. వీరిలో ఐదుగురు అనుమానితులు, ఉగ్రసంస్థలైన లష్కరే తోయిబా అగ్రనేత సాజిత్ జాట్, టీఆర్ఎఫ్కు చెందిన ఇద్దరు ఉన్నారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సాజిత్ ఆయుధాలు సమకూర్చాడని ఎన్ఐఏ తమ 1,597 పేజీల సుదీర్ఘ చార్జిషీట్లో తెలిపింది.
NIA Chargesheets Pak- Based LeT/TRF & 6 other Accused in Pahalgam Terror Attack Case pic.twitter.com/yDnFPw2DGi
— NIA India (@NIA_India) December 15, 2025
వీరిపై భారత న్యాయ సంహిత 2023లోని ఆయుధాల చట్టం 1959, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ చట్టం 1976ల కింద కేసులు నమోదు చేసింది. భారత్‌పై వీరు యుద్ధం ప్రకటించారని.. వీరిని కఠినంగా శిక్షించాలని ఎన్ఐఏ వర్గాలు చెప్పాయి. జూన్‌లో భారత సైన్యం చేతిలో హతమైన పాక్ ఉగ్రవాదులు సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హంజా అఫ్గనీల పేర్లను కూడా చార్జిషీట్లో పేర్కొంది ఎన్ఐఏ.
జూలైలో భారత సైనికులు చేపట్టిన ‘ఆపరేషన్ మహదేవ్’ (Operation Mahadev)లో ముగ్గురు లష్కరే ప్రధాన ఉగ్రవాదులు సులేమాన్ షా, అఫ్గన్, జిబ్రాన్‌లు హతమయ్యారు. ఈ ముగ్గురు పహల్గాం దాడిలో పాల్గొన్నారని కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో వెల్లడించారు.