NIA | పాకిస్తాన్ నిఘా అధికారులతో సీఆర్పీఎఫ్ సిబ్బంది రహస్య సమాచారాన్ని పంచుకున్నారన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శనివారం ఎనిమిది రాష్ట్రాల్లోని 15 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. మోతీ రామ్ జాట్ అనే జవాన్‌ను ఇటీవల సర్వీసు నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మోతీరామ్ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీ, మహారాష్ట్ర (ముంబై), హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ బృందాలు శనివారం సోదాలు నిర్వహించాయి. భారత వ్యతిరేక ఉగ్రవాద కుట్రలో భాగంగా పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న కార్యకర్తలు నిర్వహిస్తున్న గూఢచర్యం రాకెట్‌కు సంబంధించి ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్న మోతీ రామ్ అరెస్టు తర్వాత, ఎన్ఐఏ మే 20న కేసును నమోదు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేయగా.. దానికి బదులుగా భారతదేశంలోని వివిధ మార్గాల ద్వారా డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. బీఎన్ఎస్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నది.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. భారత్‌లో ఉంటూ పలువురు పాక్‌కు సున్నిత సమాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పలువురిని అరెస్టు చేసింది. పలువురు అధికారులు డబ్బుకోసం పాకిస్తాన్‌కు రహస్యాలు పంపగా.. మరికొందరు హనీట్రాప్‌లో పడి సున్నిత సమాచారాన్ని పంపుతున్నట్లు తేలింది. దేశ రక్షణలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్.. కీలక రహస్యాలు శత్రుదేశానికి చేరవేసినట్లుగా గుర్తించారు. 2023 సంవత్సరం నుంచి పాకిస్తాన్ నిఘా అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. వివిధ మార్గాల ద్వారా డబ్బు అందుకుంటున్నట్లు ఏజెన్సీ గుర్తించింది. ఎన్ఐఏ బృందం మొదట ఢిల్లీలో మోతీ రామ్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసింది.
ప్రస్తుతం మోతీరామ్ ఏం సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశాడన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలతో పాటు సీఆర్పీఎఫ్ నిబంధనల ప్రకారం నిందితుడిని మే 21న సర్వీసు నుంచి సీఆర్పీఎఫ్ తొలగించింది. ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినందుకు సర్వీసు నుంచి తొలగించినట్లు తెలిపింది. సీఆర్పీఎఫ్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం మోతీరామ్‌కు ఎవరితో సంబంధాలున్నాయని.. ఎలాంటి సమాచారాన్ని అందజేశాడు.. ప్రతిఫలంగా ఏం తీసుకున్నాడు.. అనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపుతున్నది.