Delhi Car Blast : ఎర్రకోట సమీపంలో భయోత్పాతం సృష్టించిన కారు బాంబు పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 13 మందిని బలిగొన్న ఈ ఉగ్రదాడితో సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కారు పేలుడు సూసౌడ్ బాంబర్ (Suicide Bomber) పనేనని తేల్చింది. వైద్యుడైన ఉమర్ ఉన్ నబీ ఉపయోగించిన ఐ20 కారును పేలుడుకు అనువుగా మార్చి విధ్వంసానికి పాల్పడ్డారని ఆదివారం ఎన్ఐఏ తెలిపింది.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద నవంబర్ 10న సంభవించిన కారు పేలుడు కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. సూత్రధారుల్లో ఒకడైన అమిర్ రషీద్ అలీని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ.. సూసైడ్ బాంబర్ పేలుడుకు అనువుగా తీర్చిదిద్దిన వాహనం ఉపయోగించాడని ధ్రువీకరించింది. వైద్యుడు ఉమర్ నబీ పేలుడుకు వాడిన కారు జమ్ము కశ్మీర్‌లోని సంబూర ప్రాంతానికి చెందిన అమిర్ పేరిటే రిజిష్టర్ అయి ఉంది. అతడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు రాబట్టింది.
⚠️ #Delhi #RedFort car blast: #NIA nabs #Kashmiri aide of #suicidebomber in major breakthrough 🔥 | https://t.co/WmeVF1y9Sl pic.twitter.com/SMart7VDuX
— Economic Times (@EconomicTimes) November 16, 2025
ఉమర్ నబీ పేలుడుకు ఉపయోగించిన వాహనాన్ని కొనేందుకు అమిర్ ఢిల్లీ వెళ్లాడు. అక్కడ ఐ20 కారు కొన్న అతడు పేలుడులో ఉమర్‌కు సహకరించినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి పేలుడులో గాయపడిన వారితో సహ ఇప్పటివరకూ 73 మంది సాక్ష్యులను ఎన్ఐఏ విచారించింది. దర్యాప్తులో ఢిల్లీ, జమ్ముకశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయం తీసుకుంటున్న ఎన్ఐఏ ఆదివారం నలుగురిని విడుదల చేసింది. ఉమర్ నబీతో కలిసి కుట్రకు పాల్పడ్డారనే అనుమానంతో వీరిని అరెస్ట్ చేశారు. విచారణలో వీరికి నబీతో సంబంధం లేదని తెలిసి వారిని విడుదల చేశారు.
నవంబర్ 10 సోమవారం సాయంత్రం 6:52 గంటలకు ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద కారు పేలుడు జరిగింది. ఎర్రకోట సిగ్నల్ వద్ద కారు స్లో అయింది. సిగ్నల్ లైట్ దగ్గర కారు ఆగుతుండగానే ఒక్కసారిగా అందులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాలు ధ్వంసం అయ్యాయి అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీ సతీశ్ గుల్చా (Sri Satish Gulcha) వెల్లడించారు.