NIA : పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిన కేసులో 15 మంది నిందితులపై ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) శనివారం చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ప్రవీణ్, రాజ్ వాల్మీకి, శివ వాల్మీకి, రితికా గ్యాంగ్‌వార్, సమీర్ @షూటర్, దుర్గేష్ నిషాద్, నౌషద్, గగన్ కుమార్, వివేక్, శివరాజ్, మీరా ఠాకూర్, షేన్ ఇరామ్ @ మహక్ అనే 15 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిపై ఉత్తర ప్రదేశ్, లక్నోలోని స్పెషల్ కోర్టులో నేడు చార్జిషీటు సమర్పించింది.
అలాగే, ఐదుగురు జువైనల్ నిందితులకు సంబంధించిన నివేదికను గత మే 18న, జువైనల్ జస్టిస్ బోర్డుకు సమర్పించారు. ఈ ఐదుగురు మైనర్స్ కావడం వల్ల వీరికి విధించే శిక్షలు వంటి అంశాల్లో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఘజియాబాద్ కమిషనరేట్ పరిధిలోని, కౌశంభి పోలీస్ స్టేషన్లో నిందితులపై గత మార్చి 14న ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిలో భాగంగా 21 మందిని అరెస్టు చేశారు. భారత దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా నిందితులు కుట్ర చేశారని ఎన్ఐఏ ఆరోపించింది. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ నిందితులు దేశానికి చెందిన కీలక, సున్నితమైన సమచారాన్ని చేరవేశారని ఆరోపించింది.
నిషేధిత ప్రదేశాలకు చెందిన జీపీఎస్ లొకేషన్స్‌కు కూడా వీరు శతృవులకు అందించారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు భారతీయ సిమ్ కార్డులను వినియోగించారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు భంగం కలిగించే పని చేశారు. మిగతా నిందితులపై కూడా విచారణ కొనసాగుతోంది. వారిపై నిపుణుల అభిప్రాయలు తీసుకున్న అనంతరం తదుపరి విచారణ జరిపి, పూర్తిస్థాయి చార్జిషీటు దాఖలు చేస్తారు. మరో ఘటనలో పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఏడుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.