హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : ఉగ్ర లింకుల కేసులో ఎన్ఐఏ, పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతున్నది. సోమవారం నాటి విచారణలో ముంబైలోనే ప్రత్యేకంగా 12మంది మానవ బాంబులను తయారు చేసినట్లు సిరాజ్, సమీర్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో ఎన్ఐఏ, ఏటీఎస్ బృందాలు ముంబైకి వెళ్లినట్లు సమాచారం. విచారణలో వారు చెప్పిన సమాధానాల ఆధారంగా అక్కడ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కాగా, 12 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇక విజయనగరం ఉగ్ర కేసు రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చడంతో ఢిల్లీ నుంచి ఐబీ టీమ్ విజయనగరం చేరుకుంది.
ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్, తెలుగు రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్బీ బృందాలు విజయనగరంలో మకాం వేశాయి. మూడు రోజులుగా జరిగిన విచారణలో నిందితులు ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. కాగా దేశ, విదేశాలకు సిరాజ్, సమీర్ నెట్ వర్ విస్తరించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఇప్పటికే వరంగల్‌కు చెందిన పర్హాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాదర్, మరో ఆరుగురు కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సామాజిక మాధ్యమాలలో సిరాజ్, సమీర్లు జరిపిన చాటింగ్‌పై దర్యాప్తు బృందాలు ఓ అవగాహనకు వచ్చాయి. తెలుగు రాష్ర్టాల్లో ఉన్న స్లీపర్ సెల్స్ గురించి, వారి ఆర్థిక లావాదేవీలపై ఎన్ఐఏ అధికారులు మరింత లోతుగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది.