Road Accidents | దేశంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు ఢీకొట్టకోవడం సహా పలు కారణాలతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా ప్రమాదాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, దేశంలో జరిగే ప్రమాదాల్లో ఎవరు ఎక్కువ ప్రమాదాల బారినపడుతున్నారో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఇందులో 18-45 సంవత్సరాల మధ్య వయస్కులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నట్లు ప్రభుత్వరంగ సంస్థ తెలిపింది. ఏడాదిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 70శాతం మంది ఈ వయసు వారేనని చెప్పింది. ఎన్హెచ్ఏఐ ప్రకారం.. 18 ఏళ్లలోపు, 60 సంవత్సరాలకుపై బడిన వారు అతితక్కువ ప్రమాదాల బారినపడుతున్నారు.
గణాకాంలను పరిశీలిస్తే 18 సంవత్సరాల్లోపు 5.3శాతం మంది మాత్రమే తీవ్రమైన ప్రమాదాలకు గురవుతున్నారు. అదే సమయంలో 60 ఏళ్లుపైబడిన వారిలో 6.4శాతం తీవ్ర ప్రమాదాల బారినపడుతున్నట్లు పేర్కొంది. 2.6శాతం మంది వయసుకు సంబంధించి సమాచారం లేదని తెలిపింది. పలు మీడియా నివేదికల ప్రకారం 2021 సంవత్సరంలో భారత్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,55,622 మంది మృత్యువాతపడ్డారు.
ఇందులో 87,050 మంది అతివేగం కారణంగా, 42,853 మంది అజాగ్రత్తగా నడపడం వల్ల మృత్యువాతపడ్డారు. ఇటీవల మహారాష్ట్రలో ప్రముఖ పారిశ్రామిక వేత్త సైరస్ మిస్త్రీ సైతం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో వెనుక సీట్లో కూర్చున్న ఆయన.. సీటు బెల్టు ధరించలేదని తేలింది. ఈ ప్రమాదం తర్వాత కార్లలో భద్రత, సురక్షిత ప్రయాణంపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది.