భోపాల్: కొత్తగా పెళ్లైన జంట కొన్ని రోజుల్లోనే విడివిడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. కొత్త దంపతుల ఆత్మహత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. (Newlywed couple die by suicide) మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన జరిగింది. మురార్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల జ్యోతి తోమర్ అలియాస్ మేఘాకు, 26 ఏళ్ల సిద్ధార్థ్ కండిల్తో ఏప్రిల్ 25న పెళ్లి జరిగింది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమే.
కాగా, పెళ్లి తర్వాత కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ కొత్త దంపతులు కలిసి ఉన్నారు. మే 1న మురార్లోని తన పుట్టింటికి జ్యోతి వెళ్లింది. అయితే మే 20న పుట్టింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది తెలుసుకున్న ఆమె భర్త సిద్ధార్థ్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మే 22న పింటో పార్క్ ప్రాంతంలోని తన ఇంటి బాత్రూంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.
మరోవైపు కొత్త జంట ఆత్మహత్యపై ఇరువురి కుటుంబాలు ఎలాంటి ఆరోపణలు చేయలేదని పోలీస్ అధికారి తెలిపారు. రెండు మరణాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త దంపతుల ఆత్మహత్యల వెనుక కారణాలను నిర్ధారించడానికి వారి మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఇతర డిజిటల్ పరికరాలను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.