Stray dogs : చిన్నారులపై వీధి కుక్కలు (Stray Dogs) దాడులు చేసి, తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్ (Hyderabad) లోని హయత్నగర్ (Hayatnagar) ఏరియాలోగల శివగంగ కాలనీ (Shivaganga colony) లో ఏడేళ్ల మూగ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. అయితే ఇందుకు భిన్నంగా పశ్చిమబెంగాల్ (West Bengal) లోని నదియా జిల్లా (Nadia district) లో కన్నవాళ్లే రోడ్డుపై వదిలేసిన చిన్నారికి వీధి కుక్కలు రక్షణగా నిలిచాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నదియా జిల్లాలోని రైల్వేవర్కర్స్ కాలనీలోగల ఓ బాత్రూమ్ ఎదుట అప్పుడే పుట్టిన పసికందును తల్లిదండ్రులు వదిలేసి వెళ్లారు. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దుప్పటిలో చుట్టి ఉన్న ఆ పసికందుకు వీధి కుక్కలు రక్షణగా నిలిచాయి. వీధి కుక్కలు పసిబిడ్డ చూట్టూ చేరి ఉదయం స్థానికులు గమనించేదాకా రక్షణ కల్పించాయి.
ఉదయం కుక్కల నడుమ పసిబిడ్డను గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పసికందుపట్ల కుక్కలు జాలి చూపడాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. చిన్నారి చుట్టూ చేరిన కుక్కలు చలిలో కొన్ని గంటలపాటు పసికందుకు కాపలాగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.