Sandeshkhali | కోల్‌కతా: దేశాన్ని కుదిపేసిన పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ఘటనకు సంబంధించి అధికార టీఎంసీ వారం రోజులుగా విడుదల చేస్తున్న వీడియోలు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో బీజేపీ సందేశ్‌ఖాలీ మండలాధ్యక్షుడిగా చెప్పుకుంటున్న గంగాధర్ కయాల్ మాట్లాడుతూ సందేశ్‌ఖాలీ ఘటనలో లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ స్థానిక నేత సత్రాప్ షాజహాన్ షేక్, ఆయన అనుచరులకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న 70 మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఆ వీడియోలో కయాల్ మాట్లాడుతూ 30శాతం మంది మహిళలు ఉండే 50 బూత్‌లలో పంపిణీ చేసేందుకు తమకు రూ. 2.5 లక్షలు అవసరమయ్యాయని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంతృప్తికరంగా డబ్బులు ఇచ్చి ఆందోళనలో ముందు ఉంచి పోలీసులతో తలపడేలా చేయాలని ఆయన చెప్పడం వినిపిస్తున్నది.
సందేశ్‌ఖాలీలో ఎన్సీడబ్ల్యూ చీఫ్ కుట్ర
సందేశ్‌ఖాలీ ఉదంతంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖా శర్మ కుట్ర ఉన్నదని తృణమూల్ ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక మహిళలను బలిపశువులను చేస్తూ క్రిమినల్ కుట్రకు పాల్పడిన రేఖాశర్మ, బీజేపీ నేత పియాలీ దాస్ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసింది. వారు ఫోర్జరీ, మోసం, దగా, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపించింది.