బెంగళూరు, ఆగస్టు 3: ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. 2000 నుంచి 2015 మధ్య నమోదైన అసహజ మరణాల రిజిస్టర్(యూడీఆర్)లోని అన్ని వివరాలను ధ్వంసం చేసినట్లు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కోరిన సమాచారానికి బేల్తాంగడీ పోలీసులు ఇచ్చిన జవాబుతో ధర్మస్థల మిస్టరీ మరణాలపై ప్రజలలో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ 15 ఏండ్ల సమయంలోనే పెద్ద సంఖ్యలో అనుమానాస్పద మరణాలు, వ్యక్తుల అదృశ్యాలకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ బాలిక మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా పూడ్చిపెట్టడాన్ని తాను కళ్లారా చూశానని ఆర్టీఐ కార్యకర్త జయంత్ ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఫిర్యాదు చేశారు.
చట్ట నిబంధనల ఉల్లంఘన జరిగిందని, ఆ బాలిక ఖననం సమయంలో చాలామంది అధికారులు అక్కడ ఉన్నారని కూడా జయంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సిట్ త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాలికను పూడ్చిపెట్టినట్లు ఆరోపిస్తున్న ప్రదేశంలో తవ్వకాలు జరిపే అవకాశం ఉంది. పోలీసుల వ్యవహారశైలిపై ఎంతోకాలంగా ఆర్టీఐ ద్వారా పోరాటం సాగిస్తున్న జయంత్ అదృశ్యమైన వ్యక్తుల వివరాలు, ఫొటోలు ఇవ్వాలని గతంలోనే బేల్తాంగడీ పోలీసు స్టేషన్‌ను తాను ఆర్టీఐ ద్వారా కోరినట్లు తెలిపారు.
అన్ని వివరాలు, పోస్టుమార్టమ్ నివేదికలు, వాల్ పోస్టర్లు, గుర్తుతెలియని మృతదేహాలను వెతికేందుకు తీసుకున్న ఫొటోలు అన్నిటినీ సాధారణ పరిపాలనా ఉత్తర్వుల కింద ధ్వంసం చేశాము అని బేల్తాంగడీ పోలీసు స్టేషన్ అధికారులు సమాధానమిచ్చినట్లు జయంత్ తెలిపారు. ఈ జవాబు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన చెప్పారు. ఆగస్టు 2(శనివారం)న తాను సిట్‌కు ఫిర్యాదు చేశానని, తాను స్వయంగా చూసిన ఓ ఘటనపై తాను ఫిర్యాదు చేశానని జయంత్ తెలిపారు. ఆ సమయంలో అక్కడ హాజరైన వ్యక్తుల పేర్లన్నిటినీ తాను పేర్కొన్నానని ఆయన చెప్పారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో రికార్డులను డిజిటలైజ్ చేయకుండా ఎలా ధ్వంసం చేయగలరని ఆయన పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ పోలీసు స్టేషన్లో రికార్డులు ధ్వం సం అయిన పరిస్థితులలో బాలిక అవశేషాలు రేపు లభించిన పక్షంలో ఆ మృతదేహాన్ని ఎలా గుర్తించగలరని ఆయన ప్రశ్నించారు.