Cancer | ఢిల్లీ, జనవరి 30: క్యాన్సర్ చికిత్సకు పరిశోధకులు సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి ద్వారా క్యాన్సర్ కణాలు తమనుతాము చేసుకునేలా ప్రేరేపించి క్యాన్సర్‌ను నయం చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు ‘నేచర్ బయోటెక్నాలజీ’లో కథనం ప్రచురితమైంది. సాధారణంగా ఔషధాల నుంచి తప్పించుకునేందుకు క్యాన్సర్ కణాలు రోగనిరోధక వ్యవస్థను తరచూ అభివృద్ధి చేస్తుంటాయి.
సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ చికిత్స నుంచి తప్పించుకుంటాయి. దీనివల్ల క్యాన్సర్ చికిత్సలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ కారణంగానే క్యాన్సర్ చికిత్సలో కాంబినేషన్ థెరపీలు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ‘టూ స్విచ్చెస్’ విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా మొదటి విడతలో జన్యుమార్పిడి చేసిన కణాలపై ఒక ప్రత్యేక ఔషధాన్ని ప్రయోగించగా.. అది జన్యుమార్పిడి కణాల సంఖ్యను రెట్టింపు చేయడంతో పాటు క్యాన్సర్ కణితిని స్వాధీనం చేసుకుంటుంది.
ఆ తర్వాత రెండో విడతలో జన్యుమార్పిడి కణాలు విడుదల చేసే రసాయనం వల్ల క్యాన్సర్ కణాలు నశించిపోయాయి. ఈ విధానంలో 20 రోజుల్లో క్యాన్సర్ కణాలను జన్యుమార్పిడి కణాలు అధిగమించాయి. రెండో జన్యువు యాక్టివేట్ చేశాక 80 రోజులకు క్యాన్సర్ కణితి పూర్తిగా నశించినట్టు పరిశోధకులు గుర్తించారు.