Karnataka | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఐదు గ్యారెంటీల పేరిట అరచేతిలో స్వర్గాన్ని చూపించి కర్ణాటకలో కిందటేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చుక్కలు చూయిస్తున్నది. ఇప్పుడు ఏకంగా గ్యారెంటీలను అందుకొంటున్న లబ్ధిదారుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికే ఈ రకమైన ఎత్తుగడకు తెర తీసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి ఎల్కే అతీఖ్, కార్యదర్శి (వ్యయ విభాగం) పీసీ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
అట్లా అయితే కష్టం
ఐదు గ్యారెంటీల అమలుకు కర్ణాటక ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి వస్తున్నది. దీంతో వ్యయాన్ని తగ్గించుకొనే ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఐదు గ్యారెంటీల లబ్ధిదారుల ఏరివేత చేపట్టాలని, కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఈ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బడ్జెట్లో మెజారిటీ వాటాను గ్యారెంటీల కోసమే ఖర్చు చేస్తే ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాకపోవచ్చని కూడా సీఎం అధికారుల ముందు వాపోయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
లబ్ధిదారులను తగ్గించవచ్చు
తొలుత బీపీఎల్ (రేషన్) కార్డుల ఏరివేతను చేపట్టాలని, తద్వారా అన్నభాగ్య స్కీమ్ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించవచ్చని సీఎం అధికారులకు సలహా ఇచ్చినట్టు తెలుస్తున్నది. మహిళలకు రూ.2 వేల చొప్పున ఇస్తున్న గృహలక్ష్మి పథకంలో కూడా కోతలు విధించాలని సీఎం సూచించినట్టు సమాచారం. ఇంట్లో ఎవరైనా సంపాదిస్తే ఆ ఇంట్లోని మహిళను ఈ స్కీమ్‌కు అనర్హురాలిగా ప్రకటించేలా కొత్త రూల్ జోడించాలని కూడా ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
శక్తి స్కీమ్‌లో భాగంగా ఆర్డినరీ బస్సుల సంఖ్యను తగ్గించాలని, స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత సదుపాయాన్ని రద్దు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక, గృహజ్యోతి స్కీమ్ పేరిట ఇప్పటికే కరెంటు బిల్లులను పెంచిన ప్రభుత్వం.. నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లించే యువనిధిని ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడం గమనార్హం.
కాగా, ఐదు గ్యారెంటీల అమలు సర్కారుకు గుదిబండగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి ఈ ఏడాది తొలినాళ్లలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్‌గా మారాయి. ‘ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారెంటీలను కొనసాగించాలంటే ఏటా రూ.58 వేల కోట్లు అవసరం. ఇది ఖజానాపై పెను భారమే. అందుకే, దీనిపై ఏం చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నాం. ఒకవైపు గ్యారెంటీలను అమలు చేస్తూనే, వ్యయాన్ని తగ్గించుకోడానికి స్కీమ్ నిబంధనల్లో ఏమేం మార్పులు చేర్పులు తీసుకురావొచ్చో చర్చిస్తున్నాం’ అని రాయరెడ్డి అన్నారు.
ఏడాదిన్నర పాలనపై సర్వేకు ఆదేశం
ఎన్నికల్లో ఇస్తామన్న గ్యారెంటీల అమలు ఎప్పుడో అటకెక్కింది. పాలన మొత్తంగా పడకేసింది. అభివృద్ధి పనుల ఊసులేదు. వీటికి తోడు వాల్మీకి, ముడా తదితర స్కామ్‌లతో కర్ణాటక కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇది గమనించిన సీఎం సిద్ధరామయ్య తమ ప్రభుత్వ ఏడాదిన్నర పాలనపై సర్వే చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన భేటీలో అధికారులను ఈ దిశగా ఆదేశించారు. రెవెన్యూ రాబడులు తగ్గడంపై కూడా సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.