Cholesterol | న్యూఢిల్లీ, నవంబర్ 19: గుండె జబ్బులు ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కబళిస్తున్నాయి. రక్తనాళాల్లో కొవ్వు (కొలెస్ట్రాల్) అధికంగా పేరుకుపోవడం ఈ జబ్బులకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గించే సరికొత్త పిల్‌ను అమెరికన్ బహుళజాతి ఔషధ సంస్థ ‘ఎలీ లిల్లీ’ ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసింది. ‘మువలాప్లిన్’ అనే ఈ పిల్‌ను అధిక మోతాదులో ఉపయోగించడం ద్వారా కొలెస్ట్రాల్ 70 నుంచి 86 శాతం మేరకు తగ్గినట్టు పరీక్షల్లో తేలిందని సోమవారం షికాగోలో జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సమావేశంలో పరిశోధకులు వెల్లడించారు.
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించేందుకు ప్రస్తుతం పలు రకాల ఇంజెక్టబుల్ థెరపీలు అందుబాటులో ఉన్నప్పటికీ నోటి ద్వారా తీసుకోగలిగే ఏకైక ఔషధం ‘మువలాప్లిన్’ మాత్రమే. మిడ్-స్టేజ్ ట్రయల్స్‌లో పరిశోధకులు ఈ పిల్‌ను అధిక కొలెస్ట్రాల్ (లిపోప్రొటీన్-ఏ)తో బాధపడుతున్న 233 వయోజనులపై పరీక్షించారు. వారిలో కొందరికి 10 మిల్లీగ్రాములు, మరికొందరికి 60 మిల్లీగ్రాములు, ఇంకొందరికి 240 మిల్లీగ్రాముల డోసులు ఇచ్చారు.
అనంతరం సంప్రదాయ, ఆధునిక పద్ధతులతో కూడిన రక్తపరీక్షల ద్వారా ఆ రోగుల్లోని కొలెస్ట్రాల్ స్థాయిలను పరిశీలించారు. 10 మిల్లీగ్రాముల డోసు తీసుకున్న రోగుల్లో 40.4 నుంచి 47.6 శాతం, 60 మిల్లీగ్రాముల డోసు తీసుకున్న రోగుల్లో 68.9 నుంచి 81.7 శాతం, 240 మిల్లీగ్రాముల డోసు తీసుకున్న రోగుల్లో 70 నుంచి 85.8 శాతం మేరకు కొలెస్ట్రాల్ తగ్గినట్టు ఈ పరీక్షల్లో తేలిందని పరిశోధకులు వెల్లడించారు.