న్యూఢిల్లీ : రైల్వే బోర్డు వచ్చే నెల ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నది. ఏ రైలుకైనా బుకింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత మొదటి 15 నిమిషాల్లో జనరల్ రిజర్వేషన్ టికెట్స్‌ను బుక్ చేయాలంటే ప్రయాణికులకు ఆధార్ వెరిఫైడ్ ఐఆర్సీటీసీ అకౌంట్స్ తప్పనిసరిగా ఉండాలి. దీనివల్ల మోసపూరిత బుకింగ్స్‌కు కళ్లెం వేయవచ్చునని, అసలైన ప్రయాణికులకు న్యాయంగా టికెట్ బుకింగ్ అవకాశాలు లభిస్తాయని బోర్డు భావిస్తున్నది.
ఉదాహరణకు, ఓ ప్రయాణికుడు న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే శివగంగ ఎక్స్‌ప్రెస్ రైలులో నవంబరు 15న ప్రయాణించడం కోసం టికెట్ బుక్ చేయాలి. దీనికి బుకింగ్ విండో సెప్టెంబరు 16 రాత్రి 12.20 గంటలకు ఓపెన్ అవుతుంది. కాబట్టి రాత్రి 12.20 గంటల నుంచి 12.35 గంటల మధ్యలో కేవలం ఆధార్ వెరిఫైడ్ ఐఆర్సీటీసీ అకౌంట్లు ఉన్న యూజర్లు మాత్రమే ఈ రైలు టికెట్లను బుక్ చేసుకోగలుగుతారు. ఆధార్ ఆథెంటికేషన్ లేనివారు ఈ 15 నిమిషాల సమయంలో టికెట్లను బుక్ చేసుకోలేరు.
దీపావళి, ఛాత్ పూజ, హోలీ వంటి ప్రధాన పండుగల సమయాల్లో, పెళ్లిళ్ల సీజన్లో రైలు టికెట్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ప్రయాణ తేదీకి 60 రోజుల ముందుగా బుకింగ్ విండో ఓపెన్ అయినపుడు ఈ డిమాండ్ అధికంగా ఉంటుంది. జనరల్ బుకింగ్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ఆధార్ ఆధారిత నిబంధన వల్ల బుకింగ్ ప్రాసెస్ పారదర్శకంగా ఉంటుందని రైల్వే బోర్డు భావిస్తున్నది.