షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ఇవాళ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని షిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ సచివాలయంలో పాత ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్‌ను తొలగించి కొత్త ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు పేరుతో ఉన్న కొత్త నేమ్ ప్లేట్‌ను ఏర్పాటు చేశారు.
ఇటీవలి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ నూతన ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయడానికి పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. రాష్ట్ర పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు సీఎం పదవి కోసం పోటీ పడటంతో.. అందరినీ ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి సుఖ్విందర్ సింగ్ సుఖు పేరును ఖరారు చేయడంలో హిమాచల్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ శుక్లా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కీలక పాత్ర పోషించారు.
దాంతో సుఖ్విందర్ సింగ్ ఇవాళ హిమాచల్ రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతోపాటే ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత్రి కూడా ప్రమాణస్వీకారం చేశారు.