ఆన్లైన్ న్యూస్ కంటెంట్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని రకాల ఆన్లైన్ వార్తలు, వార్తా సంబంధిత కంటెంట్, వీడియోలు, వెబ్సైట్లు, సోషల్ మీడియా కామెంటరీని సైతం చట్టపరిధిలోకి తీసుకురానున్నది. ఇందుకు సంబంధించి బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (రెగ్యులేషన్) బిల్లు-2024 పేరుతో ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. న్యూస్ ఇన్ఫ్లుయెన్సర్లను ‘డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్లు’ అనే కొత్త క్యాటగిరీ కిందకు తెచ్చింది. క్యాబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.
Online News | న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలను ఒకే చట్టం కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులోభాగంగా కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ యాక్ట్-1995 స్థానంలో బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (రెగ్యులేషన్) బిల్లు-2024ను తీసుకొస్తున్నది. దీని ప్రకారం సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వీడియోలు అప్లోడ్ చేసే వాళ్లు, పాడ్‌కాస్ట్‌లు చేసే వాళ్లు, ఆన్లైన్లో కరెంట్ అఫైర్స్ కంటెంట్ రాసేవాళ్లు ఇకపై ‘డిజిటల్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్’ కిందకు రానున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది.
మీడియా లేదా రిజిస్టర్డ్ డిజిటల్ మీడియాతో ఎలాంటి సంబంధం లేని ఆన్లైన్ న్యూస్ కంటెంట్ క్రియేటర్లకు స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలపై(ఓటీటీ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్) విధించిన నిబంధనలు, బాధ్యతలు వర్తిస్తాయా? అనే దానిపై తొలి నుంచీ ఆందోళన ఉన్నది. అయితే వీరిందరినీ ‘డిజిటల్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్’ అనే కొత్త క్యాటగిరీ కిందకు తీసుకురావడం ద్వారా తాజా బిల్లులో దీనిపై స్పష్టత ఇచ్చారు. బిల్లు మొదటి ముసాయిదాను గత ఏడాది నవంబర్‌లో ప్రజాభిప్రాయాల నిమిత్తం విడుదల చేశారు. ఆ తర్వాత పలు మార్పులతో బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు -2024 రెండో ముసాయిదాను తాజాగా రూపొందించారు. ఈ బిల్లు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్ ముందుకు రానున్నది.
‘న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్’ నిర్వచనాన్ని కూడా తాజా బిల్లులో విస్తృతపరిచారు. ఆడియో, విజువల్, ఆడియో-విజువల్ కంటెంట్, సైన్, సిగ్నల్స్, రైటింగ్, ఇమేజెస్పాటు టెక్ట్స్‌ను ఇందులో చేర్చారు. సింపుల్‌గా చెప్పాలంటే, ఆన్లైన్లో అన్ని రకాల వార్తలు, వార్తా సంబంధిత కంటెంట్, వీడియోలు, సోషల్‌మీడియాలో కామెంటరీ, వెబ్సైట్లు, న్యూస్ లెటర్స్, పాడ్‌కాస్ట్‌లు ఇలా మొత్తం అన్నింటినీ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు.
స్ట్రీమింగ్ సర్వీసెస్, డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్స్కు సంబంధించి ఇంటర్మీడియరీస్, సోషల్‌మీడియా సంస్థలకు కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా కంటెంట్ అప్లోడ్ చేసేవారు, తరచూ ట్వీట్చేసే జర్నలిస్టులు సైతం చట్ట పరిధిలోకి రానున్నారు. కాగా, ‘ఇంటర్నెట్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్’ నిర్వచనం నుంచి ఓటీటీ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్‌ను మినహాయించారు.