అయోధ్య: అయోధ్య విరాళాల దుర్వినియోగం గురించి ప్రజలకు తెలియడానికి ముందే శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌కు తెలుసునని విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ప్రతినిధులు కొందరు పోలీసులను వెంట పెట్టుకొని నిందితుల్లో ఒకరైన అవినాశ్ శుక్లా ఇంటికి ఈ నెల 5న వెళ్లారు. అక్కడ జరిపిన సోదాల్లో వారు కొంత నగదు రికవరీ చేసినట్టు సమాచారం.
దీన్ని బట్టి ఈ విషయం పోలీసులకు కూడా ముందే తెలుసు. అయితే దీనిపై ఆ సమయంలో ట్రస్ట్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. డబ్బు రికవరీ అనధికారికంగానే జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకు విరాళాల దుర్వినియోగం వార్త ప్రజలకు తెలిసింది. పోలీస్ బందోబస్తులో శుక్లా ఒక సంచి తీసుకొని కారులోకి ఎక్కిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో న్యాయపరమైన చర్యలు తీసుకోవడం ఎందుకు ఆలస్యమైందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మంది ఇండ్లలో పోలీసులు, స్థానిక మెజిస్ట్రేట్ ఆదివారం సోదాలు నిర్వహించారు.
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో నిందితుల నికర ఆస్తుల విలువ భారీగా పెరిగినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇందులో కొందరి ఆస్తి తక్కువ కాలంలోనే ఏకంగా వంద రెట్ల వృద్ధి పొందింది. భూములు, నివాస స్థలాలు, హోటళ్ల లాంటి ఖరీదైన ఆస్తులను నిందితులు కొనుగోలు చేసినట్టు సిట్ దర్యాప్తులో తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నిందితుల మధ్య డబ్బు పంపకంలో వివాదం రావడంతో ఈ విరాళాల దొంగతనం వెలుగు చూసినట్టు సమాచారం. టిన్ను యాదవ్ సహా 30 మందిని సిట్ విచారిస్తున్నది. విరాళాల చోరీపై దర్యాప్తు జరుగుతున్నదని తెలియగానే నిందితులు తమ వాట్సాప్ చాట్, ఇతర డాటాను తొలగించారు. కొందరు తమ ఫోన్లను పూర్తిగా ఫార్మాట్ చేశారు. ట్రస్ట్ ప్రముఖులు, అధికారుల పాత్రపైనా విచారణ జరుగుతున్నది. ట్రస్ట్ ప్రముఖులెవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు.