అయోధ్య: అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన ప్రధాన సహాయకుడు, డ్రైవర్ టిన్నూ యాదవ్ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. తనపై రాయ్‌కు ఉన్న నమ్మకాన్ని అవకాశంగా తీసుకొని టిన్నూ యాదవ్ ఈ మోసానికి పాల్పడ్డాడు. పోలీసులకు పట్టుబడే ముందు ఈ సమాచారాన్ని అతడు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఒకరికి లీక్ చేసినట్టు రాయ్ తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హుండీల్లోని డబ్బును ఆలయం కింద ఉన్న లెక్కింపు కేంద్రానికి తరలించడాన్ని టిన్ను యాదవ్ పర్యవేక్షించేవాడు. లెక్కింపు గది తాళం ఒకటి టిన్ను యాదవ్ దగ్గర, మరొకటి బ్యాంక్ సిబ్బంది దగ్గర ఉండేది. బ్యాంక్ సిబ్బందితో టిన్ను యాదవ్ కుమ్మక్కై ఈ చోరీకి పాల్పడ్డాడు.
ఈ కేసులో నిందితుడైన అవినాశ్ శుక్లా సోదరుడు అమిత్ శుక్లా నోట్ల కట్టలను చేతులతో పట్టుకొని ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఈ ఫొటో నిరుడు ఆగస్ట్‌లో తీసిందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ కేసులోని నిందితుల ఇండ్లల్లో పోలీసులు తాజాగా సోదాలు నిర్వహించారు. అవినాశ్ శుక్లా ఇంటి నుంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. 900-1000 డాలర్ల విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకొన్నారు. ఇప్పటి వరకు ఏడుగురు నిందితుల నుంచి రూ.79.85 లక్షలను రికవరీ చేశారు.