Delhi Railway Station Stampede | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. వీరిలో 14 మంది మహిళలు, నలుగురు పిల్ల లు ఉండగా.. 10 ఏండ్ల లోపు వారు ఇద్దరు ఉన్నారు. డజను మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, వారికి లోక్‌నాయక్ జయ్‌ప్రకాశ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. లెక్కకు మించి టికెట్ల విక్రయం, రైల్వే శాఖ అనౌన్స్మెంట్లో గందరగోళమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా కన్పిస్తున్నది. ఈ ప్రమాదంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తున్నది. ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైళ్లను రెండూ ఒకే సమయంలో పెట్టడం, వేలాది మందితో ప్లాట్‌ఫాం కిక్కిరిసినా తగిన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం, ప్రమాదం జరిగిన మరునాడైన ఆదివారం కూడా స్టేషన్లో అవే పరిస్థితులు కన్పించడం ఆ శాఖ వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి.
ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైళ్ల పేర్లు రెండూ ఒకేలా ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ప్లాట్ఫారం 14పై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఉంది. అదే సమయంలో ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు 12వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే అప్పటికే 14వ ప్లాట్‌ఫాంపై వేచి చూస్తున్న చాలామంది తాము ఎక్కాల్సింది అ రైలేమోనని భావించి గందరగోళానికి గురయ్యి 12వ నంబర్ పైకి వెళ్లడానికి ఓవర్ బ్రిడ్జి వైపు పరుగులు తీశారు. మరికొందరు జనరల్ టికెట్లు తీసుకున్న వారు సైతం అందులో సీటు దొరుకుతుందేమోనని పరుగులు పెట్టారు.
ఈ సందర్భంగా ఏర్పడిన తొక్కిసలాట నుంచి తప్పించుకోవడానికి కొందరు సామాన్లు వదిలి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఎక్కగా, చాలా మంది కింద పడ్డారు. వారిని తొక్కుకుంటూ మిగతా వారు పరుగులు తీయడంతో పలువురు మృతి చెందారు. ఉత్తర రైల్వే సీపీఆర్వో హిమాన్షు ఉపాధ్యాయ్ కథనం ప్రకారం ఫుట్ఓవర్ బ్రిడ్జి పై నుంచి 14,15 ప్లాట్‌ఫాంల పైకి వచ్చే కొందరు ప్రయాణికులు జారి మిగతా వారిపై పడటంతో ఏర్పడిన తొక్కిసలాటలో ఈ మరణాలు సంభవించాయని చెప్పారు.
మరికొందరు ప్రయాణికుల కథనం ప్రకారం.. ఒక పక్క రైళ్లు సమయానికి బయలుదేరకపోవడం, మరో పక్క గంటకు 1500కు పైగా జనరల్ టికెట్లను అమ్మడంతో ప్లాట్‌ఫామ్‌లపై జనం పేరుకుపోయి తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. అలాగే ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్లాట్‌ఫాంల మార్పు పై తప్పుగా అనౌన్స్మెంట్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారని, అది తొక్కిసలాటకు దారి తీసిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు రైల్వే శాఖ ఇద్దరు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయల వంతున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఒక వేళ ఆయన రాజీనామా చేయకపోతే ఢిల్లీ రైల్వేస్టేషన్ నిర్వహణా లోపానికి బాధ్యుడిని చేస్తూ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ కోరారు. వెల్లువలా వస్తున్న ప్రయాణికుల గురించి రైల్వేకు తెలుసని, అయినా ఆ శాఖ గంటకు 1500 టికెట్లను అమ్మిందని ఆమె ఆరోపించారు. చివరి నిమిషంలో ప్లాట్‌ఫాంల మార్పు గురించి రైల్వే శాఖ చేసిన ప్రకటన కారణంగానే ఈ తొక్కిసలాట చోటుచేసుకుందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచి పెడుతున్నదని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మహా కుంభమేళా లాంటి ఒక మహా ఉత్సవం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలి. అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. కానీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం నిర్వహణా లోపాల్ని ఎత్తిచూపుతున్నది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికార బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపడుతున్న దాఖలాలు కన్పించడం లేదు. ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణ, జనసమూహ నిర్వహణలో ఈ వైఫల్యం స్పష్టంగా కన్పిస్తున్నది. ఇప్పటివరకు కుంభమేళాలో మూడు తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి.
జనవరి 29న కుంభమేళాలో అమృత స్నానం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. సంగమ్ నోస్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక చిన్నారి సహా ఏడుగురు మరణించారని ఇండియా టుడే వెల్లడించింది. ఇక కుంభమేళాలో ఏర్పాటు చేసిన టెంట్లలో ఐదారుసార్లు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కుంభమేళాకు వచ్చే దారుల్లో 300 కి.మీ వరకు ట్రాఫిక్ జామ్ అవుతున్నదంటే ఏర్పాట్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రయాణికుల తాకిడికి తాళలేక ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ తాత్కాలికంగా మూసివేత, నో ట్రాఫిక్ జోన్‌గా ప్రకటించడం, రోడ్డు మార్గంలో వచ్చే ప్రయాణికులు వాహనాలు దిగి సుమారు 30, 40 కి.మీలు కాలినడకన ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడటం.. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను తేటతెల్లం చేస్తున్నాయి.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన తొక్కిసలాట తర్వాత అయినా ప్రభుత్వం పాఠం నేర్చుకున్నట్టు లేదు. ఆదివారం కూడా స్టేషన్లో అలాంటి నిర్లక్ష్య ఘటనలే చోటుచేసుకుంటున్నా అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారు. పోలీసులు ఆ పరిసరాల్లోనే కన్పించ లేదు. ఆదివారం ప్లాట్‌ఫాం 16పైకి వచ్చిన బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి ప్రయాణికులు ఎగబడ్డారు. టికెట్లు లేని వారు, రిజర్వేషన్ లేని వారు రిజర్వ్డ్, ఏసీ బోగీల్లోకి దౌర్జన్యంగా చొరబడి సీట్లను ఆక్రమించుకున్నారు. రైలులోకి ఎక్కేందుకు తీవ్ర తోపులాటలు జరిగాయి. కొందరు ఎమర్జెన్సీ విండోల నుంచి తమ లగేజీని లోపలికి విసరడం కన్పించింది. ఒక వృద్ధురాలిని ఎమర్జెన్సీ కిటికీ లోంచి లోపలికి పంపడానికి ప్రయత్నించగా, ఆమె అందులో ఇరుక్కుపోయింది. ఘోర ప్రమాదం తర్వాత కూడా ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఆదివారం కూడా అధికంగానే కన్పించింది.