Delhi Pollution | న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టేసింది. ఇండ్లు, కార్యాలయాల లోపల కూడా పొగ అలుముకున్నది. దీంతో ఢిల్లీవాసులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. కళ్లు పొడిబారడం, మంట వంటి సమస్యలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం తీవ్రతకు వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాలుష్యం కారణంగా 14 విమానాలను దారి మళ్లించారు. పాఠశాలలు మూసివేసి, ఆన్లైన్ తరగతులు చెప్తున్నారు. ఇంత తీవ్రమైన కాలుష్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఢిల్లీ ప్రజలు చెప్తున్నారు. ఊపిరి తీసుకుంటున్నామో, పొగ తాగుతున్నామో అర్థం కానంతగా కాలుష్యం పెరిగిపోయిందని వాపోతున్నారు. మాస్కులు లేనిది ప్రజలు రోడ్డు మీదకు రావడం లేదు.
కొలమానాలకు అందనంత కాలుష్యం
నగరంలో సోమవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 494గా రికార్డు అయ్యింది. గత ఆరేండ్లలో ఇది రెండో అత్యధికం. అయితే, సీపీసీబీ లెక్కల కంటే చాలా ప్రమాదకరంగా కాలుష్యం ఉన్నట్టు స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ పేర్కొన్నది.
విమానాలు దారి మళ్లింపు
పొగ కాలుష్యం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సిన 14 విమానాలను జైపూర్, డెహ్రాడూన్‌కు మళ్లించారు. కాలుష్యం నేపథ్యంలో అన్ని తరగతులకూ ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.
49 సిగరెట్లు తాగడంతో సమానం
ఢిల్లీలో 494 ఏక్యూఐ నమోదైందనే వార్తలపై స్పందించిన నిపుణులు.. ఇంత కాలుష్యంలో ఊపిరి తీసుకోవడం అంటే రోజూ 49 సిగరెట్లు కాల్చటంతో సమానమని తెలిపారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారే కాకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం ఈ స్థాయి కాలుష్యానికి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, శ్వాసకోశ సంబంధ సమస్యలకు గురి కావొచ్చని హెచ్చరించారు. ఎన్-95 మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.