న్యూఢిల్లీ, మే 3: పహల్గాం ఉగ్రదాడి దరిమిలా భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని వస్తువుల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) మే 2న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుంది. పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎగుమతి అయ్యే అన్ని వస్తువులపై నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య విధానం(ఎఫ్టీపీ)లో ఒక నిబంధన చేర్చినట్లు నోటిఫికేషన్ పేర్కొంది.
తదుపరి ఉత్తర్వుల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. జాతీయ భద్రత, ప్రభుత్వ విధానం ప్రయోజనాల కోసం పాకిస్థాన్ నుంచి లేదా పాకిస్థాన్ మీదుగా వచ్చే అన్ని వస్తువులపై దిగుమతి నిషేధం విధించినట్లు నోటిఫికేషన్ తెలిపింది. ఈ ఆంక్షలకు ఎటువంటి మినహాయింపులైనా భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరమని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది.
ఎఫ్టీపీలో పాకిస్థాన్ నుంచి దిగుమతులపై నిషేధం శీర్షికతో నిబంధనను చేర్చింది. ఏప్రిల్ 22న జరిగిన అత్యంత పాశవిక ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ అనేక దౌత్యపరమైన, ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ కూడా భారత్‌తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేసింది. భారత్, పాక్ మధ్య ఇటీవలి సంవత్సరాలలో ద్వైపాక్షిక వాణిజ్యం బాగా తగ్గిపోయింది.
పాకిస్థాన్ నుంచి భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే వస్తువులలో రాగి, రాగి పాత్రలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, పత్తి, ఉప్పు, సల్ఫర్, రంగు రాళ్లు, సేంద్రియ రసాయనాలు, ఖనిజ ఇంధనాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఉన్ని, గాజువస్తువులు, ముడి చర్మాలు, చర్మం మొదలైనవి ఉన్నాయి. పాకిస్థాన్‌కు భారత్ ఎగుమతులలో కూడా గణనీయమైన తగ్గుదల ఉంది. 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య 44.77 కోట్ల డాలర్ల ఎగుమతులు ఉండగా అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 110 కోట్ల డాలర్ల ఎగుమతులు ఉన్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. మరోవైపు పాక్ నుంచి గగనతల, ఉపరితల మార్గాల్లో వచ్చే అన్ని రకాల పార్శిళ్లు, మెయిళ్ల ఎక్సేంజిని భారత్ నిలిపివేసింది. పాక్‌కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిపై ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
భారత నౌకాశ్రయాల్లోకి పాకిస్థాన్ నౌకలు ప్రవేశించడంపై శనివారం భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అదే విధంగా పాకిస్థాన్ నౌకాశ్రయాల్లోకి భారతీయ నౌకలు వెళ్లడాన్ని కూడా నిషేధించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జల మార్గాల శాఖ తెలిపింది. భారత దేశ ఆస్తులు, సరుకు, నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలను పరిరక్షించుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. ఏదైనా నౌకకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వడం గురించి సందర్భాన్ని బట్టి పరిశీలించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
తమ వ్యవస్థలు, సిబ్బంది యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు భారత నౌకా దళం ప్రకటించింది! ఈ మేరకు భారత నావికా దళం శనివారం ఓ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీనిలో డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ కోల్‌కతా ఉపరితల నౌక, స్కార్పీన్ క్లాస్ జలాంతర్గామి, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఉన్నాయి. వీటిని ‘నావికా దళ త్రిశూల శక్తి’గా నావికా దళం అభివర్ణించింది. “నావికా దళ త్రిశూల శక్తి – తరంగాలపైన, కింద, ఆవల” అని రాసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. ఇది ఫైల్ ఫొటో అయి ఉండవచ్చు. ఈ సందర్భంగా నావికా దళం గత వారం అరేబియా సముద్రంలో అనేక యాంటీ-షిప్ ఫైరింగ్స్ చేస్తున్న యుద్ధ నౌకల చిత్రాలను షేర్ చేసింది. సుదూర లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. సముద్రం మధ్య నుంచి బ్రహ్మోస్ యాంటీ-షిప్, యాంటీ సర్ఫేస్ క్రూయిజ్ మిసైల్స్‌ను ఫైర్ చేస్తున్నట్లు ఈ పోస్ట్‌లో కనిపించింది. మన దేశ సముద్ర సంబంధిత ప్రయోజనాలను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా అయినా కాపాడేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆంక్షలు, ప్రతీకార చర్యలకు పాల్పడుతున్న వేళ.. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే పలు మీడియా సంస్థలు, నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా భారత సైనికాధికారులను లక్ష్యంగా చేసుకుని నిస్సిగ్గుగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ, వారి ప్రతిష్టను దిగజార్చడానికి విఫలయత్నం చేస్తున్నాయి. అయితే అధికారిక రికార్డులు, అధికారిక వాస్తవ తనిఖీలు ఈ వాదనలను పూర్తిగా తోసి పుచ్చడమే కాక, అవి అవాస్తవమని నిర్ధారిస్తున్నాయి. భారత డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ డీఎస్ రాణాను ప్రభుత్వం విధుల నుంచి తొలగించిందని, ఉత్తర కమాండ్‌లో భద్రతా వైఫల్యానికి కారకుడిగా పేర్కొంటూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సుచీంద్ర కుమార్‌ను విధుల నుంచి తొలగించారని పాక్ మీడియా దుష్ప్రచారం చేసింది. పాకిస్థాన్‌తో యుద్ధానికి నిరాకరించినందుకు ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ ఎస్పీ ధర్కర్ను డిస్మిస్ చేశారనీ ప్రచారం చేసింది.